తమ్ముడిని ఆదుకున్న అన్న ! అనిల్ అప్పు తీర్చేసిన ముఖేష్ !!

ఎరిక్ సన్ కేసు విషయంలో జైలుకి వెళ్ళాల్సిన అనిల్ అంబానీని కాపాడాడు ఆయన అన్న ముఖేష్ అంబానీ. అనిల్ చెల్లించాల్సిన రూ.453 కోట్లను ముఖేష్ అంబానీ తీర్చేశాడు. దాదాపు 15యేళ్ళ క్రితం విడిపోయిన అన్నదమ్ముల మధ్య మళ్లీ అనుబంధం మొదలైంది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ కేసు విషయంలో అనిల్ అంబానీ రూ.453 కోట్లను ఎరిక్ సన్ కంపెనీకి చెల్లించాల్సి ఉంది. కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది. ఫిబ్రవరి 20 కల్లా ఈ మొత్తం చెల్లించకపోతే అనిల్ అంబానీ మూడు నెలలు జైలుకెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో ఆ అప్పును ముఖేష్ అంబానీ తీర్చేశాడు. దాంతో అన్నా, వదినకు కృతజ్ఞతలు చెప్పాడు అనిల్ అంబానీ. కష్టకాలంలో ఆదుకున్న ముఖేష్, నీతా అంబానీకి తమ కుటుంబ తరపున కృతజ్ఞతలు చెబుతున్నట్టు ప్రకటన విడుదల చేశాడు అనిల్.

2002లోనే ధీరూభాయ్ అంబానీ రిలయన్స్ ఆస్తులను పంచుకున్న ముఖేష్, అనిల్ విడిపోయారు. అప్పటి నుంచి వేర్వేరుగా బిజినెస్ లు చేసుకుంటున్నారు. ఈమధ్య కాలంలోనే రెండు కుటుంబాల మధ్య సంబంధాలు మళ్లీ మొదలయ్యాయి. ముఖేష్ కొడుకు ఆకాశ్, కూతురు ఇషా పెళ్ళి సందర్భంగా అన్నదమ్ములు తరుచుగా కలుసుకుంటున్నారు. ధీరూబాయ్ అంబానీ భార్య కోకిలా బెన్ కోరిక మేరకు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ ను జియోలో కలిపేయడానికి నిర్ణయించాడు ముఖేష్. R.కామ్ ను రూ.23 వేల కోట్ల రూపాయలకు కొనుగోలు చేసేందుకు 2017 డిసెంబర్ 28న నిర్ణయించాడు. ధీరూభాయ్ అంబానీ జయంతి సందర్బంగా ఈ నిర్ణయం తీసుకున్నాడు ముఖేష్. అయితే ఈ ఒప్పందానికి డైరక్టరేట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఒప్పుకోలేదు. ఎరిక్ సన్ అందించిన సేవలకు ఆర్ – కామ్ భారీగా బకాయి పడటంతో డీల్ ఆగిపోయింది. ఇప్పుడు అన్న ముఖేష్ దాతృత్వంతో తమ్ముడు అనిల్ జైలుకి వెళ్ళకుండా బయటపడ్డాడు.