మాజీ సైనికుల లెటర్ పై వివాదం !

సైన్యాన్ని రాజకీయాలకు ఉపయోగించుకోవడాన్ని నిరసిస్తూ 156 మంది రిటైర్డ్ పర్సన్స్ రాష్ట్రపతికి లెటర్ రాశారన్న వార్తలపై వివాదం నడుస్తోంది. సైన్యం పేరు చెప్పుకొని రాజకీయ ప్రచారం చేస్తున్నారంటూ త్రివిధ దళాల్లో పనిచేసి రిటైర్డ్ అయిన ఉద్యోగులు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు లెటర్ రాసినట్టు వార్తలు వచ్చాయి.

మాజీ IAF చీఫ్ ఎయిర్ మార్షన్ ఎన్ సి సూరీ, ఆర్మీ జనరల్ SF రోడ్రిగ్స్ ఇలా చాలామంది ప్రముఖుల పేర్లు ఇందులో వినిపించాయి. అయితే ఈ ప్రముఖులంతా తాము ఎలాంటి లెటర్ రాష్ట్రపతికి రాయలేదని చెబుతున్నారు. తమ పేర్లు వాట్సాప్, ఈమెయిల్స్ లో వస్తుండటం ఆశ్చర్యం కలిగించిందని చెబుతున్నారు. అటు రాష్రపతి భవన్ కూడా మాజీ సైనికాధికారుల నుంచి ఎలాంటి లెటర్ తమకు రాలేదని ప్రకటన విడుదల చేసింది. దాంతో ఈ వివాదాన్ని కూడా రాజకీయాలకు వాడుకుందామని ప్రయత్నించిన కొన్ని పార్టీలకు బూమరాంగ్ అయింది. మాజీ సైనికాధికారులు మాత్రం… తాము ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే… వాళళ ఆదేశాలతో నడుస్తామనీ… ప్రభుత్వ నిర్ణయాలు తమకు శిరోధార్యమని అంటున్నారు.

వివాదం ఎక్కడ మొదలైంది ?

NDA హయాంలో పాకిస్తాన్ గడ్డపై జరిగిన మెరుపు దాడులు, ఉగ్రవాదులే లక్ష్యంగా జరిగిన వైమానిక దాడులను ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచార సభల్లో ప్రస్తావిస్తున్నారు. ఉగ్రవాదాన్ని అణచివేసే చర్యలు కాంగ్రెస్ హయాంలో జరగలేదని విమర్శిస్తున్నారు. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ సాయుధ బలగాలను మోడీజీ కి సేనా అని ఉత్తరప్రదేశ్ లో జరిగిన ర్యాలీలో వ్యాఖ్యానించడం పెద్ద దుమారం రేపింది. దీనిపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదులు కూడా వెళ్ళాయి. దాంతో సైన్యాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారని కాంగ్రెస్, తృణమూల్, వామపక్షాల సహా ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి. ఈ నేపథ్యంలోనే మాజీ సైనికులు రాష్ట్రపతికి లెటర్ రాశారని వార్తలు వెలువడ్డాయి.