రాష్ట్ర బీజేపీల మళ్లీ లొల్లి షురూ అయింది. వర్గ పోరు మళ్లా మొదలైంది. ఇంతకుముందు బీజేపీ రాష్ట్రంలో నిలదొక్కుకోలేక పోవడానికి కారణం కూడా ఇదే చెబుతారు చాలామంది సీనియర్లు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం ప్రభుత్వం ఉన్నప్పుడు సెకండ్ ప్లేసులో ఉన్న బీజేపీ ఆ తర్వాత దిగజారుతూ వచ్చింది. టౌన్లల్లో మంచి మెజార్టీ ఓట్లు ఆ పార్టీకే పడేవి. ఆ తర్వాత టీడీపీతో పొత్తు పెట్టుకొని పార్టీని సర్వనాశనం చేశారని ఇప్పటికీ చాలామంది RSS, బీజేపీ సీనియర్లు చెబుతుంటారు. అప్పట్లో ఈ వర్గపోరు తారా స్థాయిలో ఉండేది. మేం గొప్ప అంటే మేం గొప్ప అన్నట్టుగా కమలనాధులు కలహించుకునేవారు. రాష్ట్ర స్థాయిలో రెండు, మూడు వర్గాలుంటే వాటికి అనుబంధంగా జిల్లా స్థాయి దాకా ఈ వర్గపోరు కంటిన్యూ అయ్యేది. దాంతో బీజేపీని రాష్ట్రంలో ఎదగనీయకుండా నాయకులే చేశారని అంటుంటారు.

ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా బీజేపీ ప్రభంజనం కొనసాగుతోంది. అట్లనే రాష్ట్రంలోనే మొన్న నాలుగు పార్లమెంటు స్థానాలు గెలిచిన కమలం పార్టీ అర్భన్ తో పాటు గ్రామీణంలో కూడా సత్తా చాటుతోంది. దానికి కేంద్రంలో ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా నాయకత్వం ఒక కారణం అయితే, రాష్ట్రంలో టీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం బీజేపీని జనం ఆప్షన్ గా పెట్టుకోవడం మరో కారణం. ఎందుకంటే కాంగ్రెస్ లో గెలిచినోళ్ళు ఎలాగూ ఆ పార్టీలో ఉండరు. కారెక్కి షికారు చేస్తారని జనానికి తెలుసు. అందుకే అధికార పార్టీ నెగిటివ్ ఓటింగ్ అంతా బీజేపీ వైపు టర్న్ అవుతోంది.

ఈ టైమ్ ని జాగ్రత్తగా క్యాష్ చేసుకోవాల్సిన బీజేపీ నేతలు మళ్లా వర్గ రాజకీయాలు మొదలు పెట్టారు. రాష్ట్ర నాయకత్వం తమని చిన్న చూపు చూస్తోందనీ, తమ నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమాల్లో తమ ప్రమేయం లేకుండా చేస్తున్నారని ముగ్గురు ఎంపీలు బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాకు లేఖ రాశారన్న సంగతి బయటపడింది. ఎంపీలు ధర్మపురి అర్వింద్, బండి సంజయ్, సోయం బాపూరావు ఈ లెటర్ మీద సంతకం పెట్టినట్టు చెబుతున్నారు. అందుకే నడ్డాని వీలైనంత తొందర్లో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలని కూడా కోరారట.

టీఆర్ఎస్ సర్కార్ కి వస్తున్న నెగిటివ్ ఓటింగ్ ని పాజిటివ్ గా మలుచుకోవాల్సిన టైమ్ లో ఈ వర్గ పోరు ఏందని బీజేపీ కార్యకర్తలు అడుగుతున్నారు. ఇప్పటి నుంచైనా కమలం పార్టీ సీనియర్లంతా కలసి పోయి పనిచేస్తేనే వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అయినా అధికారంలోకి రావడం లేదంటే కనీసం హయ్యస్ట్ మెజార్టీగా నిలవాలంటే… అందరూ కలసి పనిచేయాల్సిందే అంటున్నారు బీజేపీ కార్యకర్తలు.