వీవీ ప్యాట్స్ లెక్కింపుపై చంద్రబాబు వార్

వీవీ ప్యాట్స్ వ్యవహారంపై కేంద్ర ఎన్నికలతో సంఘంతో తేల్చుకునేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు సిద్ధమవుతున్నారు. రేపు ఢిల్లీకి వెళ్తున్నారు. వీవీప్యాట్స్ లెక్కింపుపై సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామంటున్నారు. అమరావతిలో మాట్లాడిన చంద్రబాబు… ఏపీలో ఎన్నికల తీరు సరిగా లేదంటున్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించాయనీ… కానీ వాటిని సరిచేయడానికి వచ్చిన సాంకేతిక నిపుణులకు ఉన్న అర్హతలు ఏంటని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. వారిని ఎవరు, ఎలా నియమించారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే వీవీ ప్యాట్స్ లెక్కించడానికి ఆరు రోజులు టైమ్ పడుతుందని ఈసీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ లో పేర్కొనడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. వీవీ ప్యాట్స్ స్లిప్స్ లెక్కపెట్టడానికి 6 గంటలకు మించి పట్టదని అంటున్నారు. గతంలో బ్యాలెట్ పేపర్లు లెక్కపెట్టినప్పుడు కూడా 6 రోజులు పట్టలేదని… ఈసీ అలా ఎందుకు అఫిడవిట్ దాఖలు చేసిందని ప్రశ్నించారు ఏసీ సీఎం. దీనిపై సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తానన్నారు. దేశ స్థాయిలో పోరాటానికి కూడా టీడీపీ సిద్ధమవుతోందని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు.