రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి వైఖరి చూస్తే జనానికి ఆశ్చర్యమేస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ పథకాలకు మెచ్చి కారు పార్టీకి జనం ఫుల్ మెజార్టీ ఇచ్చారు. అధికారం కట్టబెట్టారు. అయినా ఎందుకో గులాబీ బాస్ కి శాటిస్ ఫ్యాక్షన్ లేదు… ప్రతిపక్షాన్ని ఖాళీ చేయాలన్న లక్ష్యంతోనే ముందుకెళ్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను ఎడా పెడా పార్టీలోకి లాక్కుంటున్నారు. ఇవాళ ఏకంగా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో జంప్ చేస్తున్నట్టు చెప్పారు. అంతేకాదు… కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీని TRSLPలో విలీనం చేయాలంటూ ఏకంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి లెటర్ కూడా ఇచ్చారు. సీఎం కేసీఆర్ పథకాలకు ఆకర్షితులై… తమ నియోజకవర్గాల అభివృద్ధికే అధికార పార్టీలో చేరామంటున్నారు ఈ 12 మంది ఎమ్మెల్యేలు.

పైకి అభివృద్ధి మాట చెబుతున్నా… లోపల ఏదో జరుగుతోందని సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకి కూడా కోట్ల రూపాయల లబ్ది చేకూర్చే పనికి అధికార పార్టీ ఒకే చెప్పినట్టు ఆరోపణలు వచ్చాయి. ఆయనొక్కరే కాదు… మిగతా ఎమ్మెల్యేలను కూడా ప్రలోభ పెట్టో… భయపెట్టో… టీఆర్ఎస్ లోకి చేర్చుకుంటున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఒక ఎమ్మెల్యేని జైలుకు పంపుతామని భయపెడితే, మరొ ఎమ్మెల్యేకి కాంట్రాక్టుల డబ్బులు ఇవ్వబోమని బెదిరించారని అంటున్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇలా ఎమ్మెల్యేలందర్నీ భయపెట్టి, ప్రలోభ పెట్టి తమ పార్టీలోకి లాక్కుంటున్నారని ఉత్తమ్ మండిపడుతున్నారు.

నిజానికి ఇలా ఆర్నెల్లు తిరక్కముందే ప్రజలు ఇచ్చిన తీర్పును కాదని… కారు ఎక్కుతున్న ఎమ్మెల్యేలకు సొంత నియోజకవర్గంలో ఇబ్బందికర పరిస్థితే ఉందంటున్నారు. మొన్నామధ్య ఇల్లెందు, కొత్తగూడెం నియోజకవర్గాలతో పాటు చాలా చోట్ల కాంగ్రెస్ కార్యకర్తలు, జనం తిరగబడ్డారు. ఎమ్మెల్యేలపై దాడులు కూడా చేశారు. ఇవేమీ పట్టించుకోని కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు కారు ఎక్కడానికే మొగ్గు చూపిస్తున్నారు. అయితే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పథకాలు చూసి ఆకర్షితులవుతున్నట్టు చెప్పుకుంటున్న ఎమ్మెల్యేలు… మొదటే అదే పార్టీలోకి ఎందుకు వెళ్ళ లేదని ప్రశ్నిస్తున్నారు రాజకీయ నిపుణులు. పార్టీ సిద్ధాంతాలు, పార్టీ కార్యకర్తలను పట్టించుకోకుండా వేరే పార్టీలోకి జంప్ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.

ఇక స్పీకర్ వ్యవస్థపైనా విమర్శలు వస్తున్నాయి. 2/3 ఎమ్మెల్యేలు వేరే పార్టీలోకి జంప్ చేస్తే… లేదంటే అమ్ముడు పోతే… ఆ పార్టీని విలీనం చేయడం అనేది తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఎమ్మెల్యేలను అనర్హులుగా చేయాలన్న కాంగ్రెస్ పిటిషన్ ను పట్టించుకోకుండా… టీఆర్ఎస్ చెప్పినట్టే స్పీకర్ నడుచుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఉదయం విలీనం చేయమని లెటర్ ఇస్తే… సాయంత్రం కల్లా ఎలా విలీనం చేస్తారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.

రాజ్యాంగం, చట్టాలు ఎలా అనుకూలంగా ఉన్నా… కాంగ్రెస్ విలీన ప్రక్రియపై తెలంగాణ జనం ఎలా స్పందిస్తారన్నది… మరో ఎలక్షన్ వస్తే గానీ తెలియదు…