ఆ మధ్య వాట్సాప్ లో ఓ మెస్సేజ్ తిరిగింది.

శ్రీలంక విన్ ది టాస్… ఎలెక్టెడ్ టు స్విమ్ ఫస్ట్ అని …

ఇంగ్లండులో ప్రపంచ క్రికెట్ కప్ జరుగుతున్న తీరు చూస్తే ఇదే నిజమేననిపిస్తోంది. ప్రపంచకప్ మొదలైనప్పటి నుంచి వరుణుడు కూడా రెడీ అవుతున్నాడు. తాను కూడా మ్యాచులు చూట్టానికి మైదానాలకి వచ్చేస్తున్నాడు. దాంతో ఇప్పటి దాకా నాలుగు మ్యాచులు రద్దయ్యాయి. దాంతో ప్రపంచ క్రికెట్ కప్ అంటే పడిచచ్చే అభిమానులు… ఈ మ్యాచుల రద్దును తట్టుకోలేకపోతున్నారు. వర్షాకాలం టైమ్ లో ఇంగ్లండ్ లో వేదికలు ఏర్పాటు చేయడమేంటని సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు.

అభిమానుల పరిస్థితే ఇలా ఉంటే… ఇక మ్యాచ్ నిర్వాహకులు, అడ్వర్టయిజర్లు పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నాలుగు మ్యాచులు రద్దవడంతో నిర్వాహకులకు రూ.180 కోట్ల నష్టం జరిగింది. ముఖ్యంగా ఈసారి ప్రపంచ కప్ రైట్స్ కొనుక్కున్న స్టార్ స్పోర్ట్స్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ముందుగానే ఇన్సూరెన్స్ చేసినప్పటికీ … బీమా కంపెనీలు ఇంత పెద్ద మొత్తాన్ని ఇస్తాయా అన్నది డౌట్ గా మారింది.

భారత్ – పాక్ మ్యాచ్ పరిస్థితి ఏంటి ?

ఇంగ్లాండ్ వాతావరణ పరిస్థితులు భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ కి కూడా గండంగా మారాయి. ఆదివారం జరిగే మ్యాచ్ కు వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్ ఎక్స్ పర్ట్స్ ఇప్పటికే ప్రకటించారు. అదేగాని జరిగితే నిర్వాహకులకు నష్టం భారీగా ఉండే అవకాశముంది. ప్రపంచంలోనే అత్యంత టెన్షన్ ఉన్న మ్యాచ్ అంటే అది భారత్ – పాక్ మధ్య జరిగేదే. కోట్లల్లో జనం టీవీలకు అతుక్కుపోయి చూస్తారు. ఈ ఒక్క మ్యాచ్ మీదే దాదాపు రూ.140 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఆగిపోతే స్టార్ స్పోర్ట్స్ కూడా దాదాపు ఇంతే మొత్తంలో అమౌంట్ నష్టపోయే అవకాశం ఉంది. సాధారణ మ్యాచులకు సెకనుకు 1.6 నుంచి 1.8 లక్షల రూపాయాల దాకా స్టార్ స్పోర్ట్స్ అడ్వర్టయిజ్ మెంట్ కింద వసూలు చేస్తుంది. అదే భారత్ – పాక్ మ్యాచ్ అయితే ఆ మొత్తం 2.5 లక్షలకు చేరుతుంది. ఈ మ్యాచ్ ఆగితే స్టార్ స్పోర్ట్స్ తో ఒప్పందం చేసుకున్న కోకాకోలా, ఉబర్, MRF, వన్ ప్లస్ లాంటి బడా బడా కంపెనీలు కూడా భారీగా నష్టపోయే అవకాశాలున్నాయి.