ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. దాంతో ఏ మాత్రం ప్రకటన వచ్చినా ఆలస్యం చేయకుండా స్పందిస్తున్నారు. సరిగ్గా నిరుద్యోగల అవసరాలను క్యాష్ చేసుకోడానికి సైబర్ నేరగాళ్ళు ఇప్పుడు సర్కారీ కొలువులను టార్గెట్ చేసుకున్నారు.
గతంలో పెద్ద పెద్ద కంపెనీల్లో ప్రైవేటు కొలువులు ఇప్పిస్తామన్న మోసాలు ఎక్కువగా జరిగాయి. అలాగే హైదరాబాద్ లోని అమీర్ పేట్, సికింద్రాబాద్ లాంటి ఏరియాల్లో బ్రాంచ్ లు ఓపెన్ చేసి సాఫ్ట్ వేర్ ఉద్యోగాల పేరుతో మోసాలు చేశారు చాలామంది. లక్షలు, వేలల్లో డిపాజిట్లు కట్టించుకొని ఆ తర్వాత బిచాణా ఎత్తేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని వేల కేసులు ఇలాంటివి బయటపడగా లక్షలు, కోట్ల రూపాయల్లో నిరుద్యోగులను దగా చేశాయి ఈ కంపెనీలు.

మనం ప్రైవేటు కంపెనీలు, కన్సల్టెన్సీలకు అప్లయ్ చేసిన రెజ్యూమ్స్ ను పట్టుకొని సైబర్ నేరగాళ్ళు కొత్త నేరాలకు పాల్పడుతున్నారు. అక్షరం ముక్క చదువుకోని వాళ్ళు కూడా ఉత్తరప్రదేశ్, బిహార్ అడ్డాగా కాల్ సెంటర్స్ పెట్టి…. ఉద్యోగాల పేరుతో ఫేక్ కాల్స్ చేసి నిరుద్యోగులను నిండా ముంచుతున్నారు. ఇటీవల బ్యాక్ డోర్ ఉద్యోగాల పేరుతో ఉప్పల్ కి చెందిన ఇద్దరు బీటెక్ నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారు. ప్రముఖ కంపెనీ పేరు చెప్పి పైసలు వసూలు చేయడమే కాకుండా… ఫేక్ అపాయింట్ మెంట్ లెటర్స్ కూడా ఇచ్చారు. ఆ అపాయింట్ మెంట్ లెటర్ పట్టుకొని వెళ్ళిన ఆ ఇద్దరు నిరుద్యోగులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంకైంది. దారుణంగా మోసపోయామని తెలుసుకొని చివరకు న్యాయం చేయాలంటూ ఉప్పల్ పోలీసులను ఆశ్రయించారు.

కోల్ ఇండియా పేరుతో ఘరానా మోసం

ఇప్పటికే ప్రైవేటు కొలువుల పేరుతో నిరుద్యోగులను ముంచుతున్న సైబర్ నేరగాళ్ళు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలను నిరుద్యోగులకు ఎరగా వేశారు. సౌత్ సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ లో 88,585 ఉద్యోగాలంటూ భారీ ప్రకటన ఇచ్చారు. ఈ ప్రకటనకు ఓ నెంబర్ కూడా ఇచ్చి… వెబ్ సైట్ సృష్టించారు. ఇది అసలో… నకిలీయో తెలుసుకోలేనంతగా నిరుద్యోగులను నమ్మించారు. ఇది కోల్ ఇండియా అనుబంధ సంస్థగా నమ్మించారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీటెక్ అర్హతలతో ఉద్యోగాలు ఉన్నట్టు నమ్మించారు. దాంతో చాలామంది నిరుద్యోగులు ఈ వెబ్ సైట్ లో ఫీజులు చెల్లించారు. అయితే ఈ ఉద్యోగాలు నిజమో కాదో తేల్చుకోకుండా… కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు కూడా ఈ ప్రకటనను తమ యాప్ ల ద్వారా జనానికి చేరవేశాయి. దాంతో పాపం నిరుద్యోగులు దారుణంగా మోసపోయారు.ఇదంతా ఫేక్ నోటిఫికేషన్ అని కోల్ ఇండియా సంస్థ తేల్చిచెప్పింది. సౌత్ సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ అనే సంస్థ అనేది తమకు లేనే లేదని ఆ సంస్థ ప్రకటన జారీ చేసింది.

నిరుద్యోగులకు విజ్ఞప్తి

మీకు ఇలాంటి భారీ నోటిఫికేషన్ వస్తే… తప్పనిసరిగా నేను మన www.telanganaexams.com వెబ్ సైట్ లో వివరాలు ఇస్తాను. అవసరమైతే వాటికి ఎలా ప్రిపేర్ అవ్వాలో Telangana Exams యూట్యూబ్ ఛానెల్ ద్వారా మీకు వీడియో క్లాస్ కూడా అందిస్తాను. అందువల్ల మీరు తొందరపడి ఇలాంటి సైబర్ నేరగాళ్ళ మాయలో పడొద్దు. మీరు ఉద్యోగ సమాచారం నిర్ధారించుకోడానికి అవసరమైతే మన జిల్లా గ్రూపుల వాట్సాప్ లో అడిగితే నేను కన్ఫర్మ్ చేసుకున్నాక మీకు చెబుతాను. గతంలో కూడా ఇలాంటి ప్రకటనలు అనేకం వచ్చినప్పుడు మిమ్మల్ని అలెర్ట్ చేశాను. గతంలో IBPS ఫేక్ ప్రకటనలు కూడా ఇలాగే వచ్చాయి.  అందువల్ల నోటిఫికేషన్ వచ్చినప్పుడు… మీరు స్వయంగా ఏదైతే గవర్నమెంట్ డిపార్ట్ మెంట్ పేరుతో ప్రకటన వెలువడిందో… ఆ వెబ్ సైట్ కి వెళ్లి స్వయంగా పరిశీలించండి… అలాంటి వాటిని మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి.  వాట్సాప్, ఫేస్ బుక్ ఇతర సామాజిక మాధ్యమాల్లో వచ్చిన నోటిఫికేషన్స్ నమ్మి మోసపోవద్దు.

అలాగే కొన్ని కోచింగ్ సంస్థలు కూడా ఉచితంగా శిక్షణ అంటూ ఈమధ్య వాట్సాప్ గ్రూపుల్లో ప్రకటనలు పంపుతున్నాయి. అవి ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు స్వయంగా కాల్ చేసి కనుక్కున్నాకే ఫార్వార్డ్ చేయండి… నలుగురికీ సాయం చేయండి… ఏవోవే ఫార్వార్డ్ చేస్తున్నాం… అంటూ ఇచ్చే ప్రకటనలకు ఫిదా అయి పోయి… అనవసరంగా వాటిని ఫార్వార్డ్ చేయొద్దు. అవి ఆయా సంస్థల అడ్వర్టయిజ్ మెంట్ కోసం వచ్చేవి అని గ్రహించండి.   అందుకే మన జిల్లా వాట్సాప్ గ్రూపుల్లో అప్పుడప్పుడు మిమ్మల్ని హెచ్చరిస్తుంటాను… వీటిని కన్ఫర్మ్ చేసుకొనే ఫార్వార్డ్ చేశారా అని… అలా చేయకపోతే…  మీలాంటి నిరుద్యోగులు మరికొందరు నష్టపోతారన్నది గ్రహించండి.