తెలంగాణలో రైతులు అరిగోస పడుతున్నారు. మొన్నటి దాకా వర్షాల్లేవు. వర్షాలు పడ్డాక నాట్లు వేసుకొని… ఇప్పుడు ఎరువుల కోసం పడిగాపులు పడాల్సి వస్తోంది. ఒకప్పుడు కాంగ్రెస్, TDP ప్రభుత్వాల్లో రైతుల క్యూలైన్లు, చెప్పులు, ఆధార్ కార్డులను లైన్లలో పెట్టడం లాంటి సంఘటనలు అనేకం కనిపించాయి. రాష్ట్రం ఏర్పడ్డాక వచ్చిన టీఆర్ఎస్ పార్టీ … మా హయాంలో రైతులకు రాజవైభోగమే అని చెప్పింది. క్యూలైన్లు ఇప్పుడు కనిపిస్తున్నాయా… అని ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రులు కూడా చాలా సార్లు గొప్పగా చెప్పుకున్నారు. ఇవన్నీ ఫస్ట్ టర్మ్ గవర్నమెంట్ లో గొప్పగా చెప్పుకున్నవి. విద్యార్థులు, ఉద్యోగుల్లో ఎంత ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా… రైతుల సపోర్ట్ ఫుల్లుగా ఉండటంతో రెండోసారి కూడా అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం.

కానీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కష్టాలు రెట్టింపు అయ్యాయన్న విమర్శలున్నాయి.. టీఆర్ఎస్ పార్టీ గొప్పగా చెప్పుకున్న రైతుబంధు పెట్టుబడి సాయం అందని రైతులు రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. ఇక మళ్ళోపాలి రుణమాఫీ చేస్తామన్న కేసీఆర్ సర్కార్… ఇప్పటి దాకా దానిపై ఒక్క ప్రకటన కూడా చేయలేదు. అటు పెట్టుబడి సాయం రాక, ఇటు బ్యాంకులో పాత బకాయిలు తీరలేదంటూ రుణాలు ఇవ్వకపోవడంతో అన్నదాతల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. చివరికి వడ్డీ వ్యాపారుల దగ్గర అధిక మిత్తీకి తెచ్చుకొని ఎలాగో విత్తనాలు కొనుక్కొని పొలం పనులు మొదలుపెట్టారు.
ఇప్పుడు యూరియా కష్టాలు రైతులను వేధిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అవసరాలకు మించి యూరియా పంపినా… రాష్ట్రంలో వాటిని దాచుకోడానికి గోదాములు లేవు. రాష్ట్ర ప్రభుత్వం లక్ష మెట్రిక్ టన్నులు అడిగితే … కేంద్రం 2 లక్షల మెట్రిక టన్నుల యూరియా పంపిందని కేంద్ర మంత్రి సదానంద గౌడ స్వయంగా చెబుతున్నారు.

రైతన్నల గోస గురించి ప్రభుత్వం ఇప్పటిదాకా అధికారికంగా ప్రకటనే చేయలేదు. కొందరు టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్, బీజేపీ లీడర్ల మీద విమర్శలు చేయడమే తప్ప… అసలు అన్నదాతల సమస్యను పరిష్కరించే ప్రయత్నం మాత్రం చేయడం లేదని తెలుస్తోంది.


బీజేపీ ఎంపీలే టార్గెట్టా ?

యూరియా కొరత అనేది ఇప్పుడు టీఆర్ఎస్, బీజేపీ మధ్య కొత్త వివాదానికి దారితీసింది. కేంద్రం ఫుల్లుగా యూరియా ఇస్తే రాష్ట్రం గోదాముల్లేక తెచ్చుకోలేదని అంటున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. అంతేకాదు… నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో బీజేపీ ఎంపీలు గెలవడంతో… ఆ మూడు జిల్లాలను టార్గెట్ చేసుకొని… రైతులకు రాష్ట్ర ప్రభుత్వం యూరియా సప్లయ్ చేయడం లేదంటున్నారు. లక్ష్మణ్ తో పాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కూడా ఇదే ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయాల కోసం రైతులను బలి చేయొద్దని కోరుతున్నారు. రాజకీయ నాయకుల ఆరోపణలు… ప్రత్యారోపణలు ఇలా ఉంటే… సిద్ధిపేట జిల్లాలో ఎరువుల కోసం క్యూలో నిలబడి ఓ రైతు గుండెపోటుతో చనిపోవడం అత్యంత బాధాకరమైన విషయం.

ఓ వైపు విష జ్వరాలతో జనం అల్లాడుతున్నారు. వేల మంది మంచానపడగా, పదుల సంఖ్యలో జనం చనిపోతున్నారు. ఇప్పుడు యూరియా సమస్య మరింత తీవ్రం కాకముందే ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుంటే బెటర్ అంటున్నారు వ్యవసాయ నిపుణులు.