ఫిట్నెస్ సిస్టమ్ తో 1.60 లక్షల మందికి నష్టం: కాంగ్రెస్

పోలీస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా జరిగిన దేహదారుఢ్య పరీక్షల్లో ఉపయోగించిన RFID సిస్టమ్ లోపభూయిష్టంగా ఉందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. నిరుద్యోగులు తమ జీవితాలను ఫణంగా పెట్టి తెలంగాణ తెచ్చుకుంటే ఇదేనా వాళ్ళకి ఇచ్చే బహుమానం అని ప్రశ్నించారు AICC అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్.

TSRLPB నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు దేహదారుఢ్య పరీక్షలకు RFID సిస్టమ్ ను వాడతామని ప్రకటించలేదని అన్నారు శ్రవణ్. ఈ సిస్టమ్ తో లక్షా 60 వేల మంది అభ్యర్థులు అర్హులై ఉండి కూడా నష్టపోయారని చెప్పారు. ఈ సిస్టమ్ నిరుద్యోగులకు గుదిబండలా మారిందని ఆరోపించారు. ఈవెంట్స్ ప్రారంభంలో RFID ఏర్పాటు చేయకుండా… చివరల్లో పెట్టారని అన్నారు దాసోజు శ్రవణ్. 800 మీటర్ల పరుగు పందెలో కూడా అవకతవకలు జరిగాయన్నారు. నల్లగొండ జిల్లాలో ఒకరి బదులు మరొకరు ఈ పరుగుపందెంలో పాల్గొన్నారు. పోలీస్ పరీక్షల్లో ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపించారు శ్రవణ్. 2016 లో దేహధారుడ్య పరీక్షల్లో నెగ్గిన ఓ యువతికి ఇప్పుడు ఇంచ్ తగ్గినట్టు ఎలా చూపించారని ప్రశ్నించారు. మార్చి 28, 29న అభ్యర్థులు అభ్యంతరాలు ఉంటే రమ్మని చెప్పి… అక్కడ ఎవరూ లేరని అన్నారు శ్రవణ్.

ఈ ఆరోపణలపై హోంమంత్రి, డీజీపీని కలుస్తామని చెప్పారు AICC అధికార ప్రతినిధి శ్రవణ్. అవకతవకలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.