చేతకాకే నా పాటలు వాడుతున్నారు:ఇళయరాజా

చెన్నై: సినిమాల్లో తన పాటలు వాడుకుంటున్న సంగీత దర్శకులపై మరోసారి మండిపడ్డారు మ్యూజిక్‌ మేస్ట్రో ఇళయరాజా. గతంలో గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ఇదే విషయంపై ఇళయరాజా నోటీసులిచ్చారు. తన అనుమతి లేకుండా కచేరీ కార్యక్రమాల్లో పాటలు పాడొద్దనీ…అనుమతి తీసుకోవడంతో పాటు తనకు పారితోషికం కూడా ఇవ్వాలని కోరారు ఇళయ్ రాజా. ఇప్పుడు కొన్ని సినిమాల్లో తాను కంపోజ్‌ చేసిన పాటలను రీమిక్స్‌లుగా చూపిస్తున్నారంటూ సంగీత దర్శకులపై మండిపడుతున్నారు ఇళయరాజా.

‘సినిమాల్లో నా పాటలను రీమిక్స్‌లుగా మార్చి వాడుకునే సంగీత దర్శకులకు టాలెంట్‌ లేదనే చెప్పాలి. టాలెంట్‌ ఉంటే మరొకరి పాటలు వాడుకోవాల్సిన అవసరం ఉండదు. ఇటీవల విడుదలైన ‘96’ చిత్రంలో నేను కంపోజ్‌ చేసిన చాలా పాటలను తీసుకుని వాటిలో మార్పులు చేసి వాడారు. ఇది చాలా తప్పు. సినిమాలో ఫలానా కాలంలో ప్రేమికులు కలుసుకున్నారు అని చెప్పడానికి నా పాటల్ని వాడుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిభ లేనివారే నా పాటలను వాడుకుంటున్నారు. దీని వెనుక కారణం ఏంటంటే.. ఇప్పుడున్న సంగీత దర్శకుల్లో సబ్జెక్ట్ లేకపోవడమే అన్నారు.

ఒకవేళ సినిమా కథ 80ల కాలం నాటిదైతే దానికి తగ్గట్టుగా సంగీతాన్నే కంపోజ్‌ చేసుకోవచ్చు కదా? కొత్త పాటలను ప్రేక్షకులకు ఎందుకు పరిచయం చేయరు? నా పాటల నుంచి జనాన్ని మళ్లించడం కుదరదు కాబట్టే… ఇప్పటికీ నా పాటలను సినిమాల్లో వాడుకుంటున్నారు అన్నారు ఇళయ్ రాజా.