టీవీ9 ల కొత్తగా ఇస్మార్ట్ న్యూస్ షురువైంది. వినాయక చవితి సందర్భంగా సోమవారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు కార్యక్రమం మొదలుపెట్టారు. ఇది అంత స్పెషల్ న్యూస్ ఎందుకని అనుకోవచ్చు… ఎందుకంటే… ఇందుల V6 ల ఫేమస్ అయిన బిత్తిరి సత్తి… అలియాస్ రవి ఉన్నడు. వీ6ల కంటే ఎక్కువ జీతం ఇస్తున్నరని TV9 కి పోయిండు. అందుకే జనం అక్కడెట్ల చేస్తున్నడో చూద్దం అనుకున్నరు.

ఆ క్రేజ్ క్యాష్ చేసుకుందమని టీవీ 9 వాళ్ళు… దీప్తి వాజ్ పేయితోటి ముందగాల పరిచయ కార్యక్రమం కూడా పెట్టిన్రు. ఎట్లుంది… ఎట్లుంటది… సత్తి వాయిస్ అక్కడ ఇమిటేట్ చేయడానికి కుదరదాయే. అందుకే… రవి కాస్త తేడాగా మాట్లాడిండు… దాంతో ఈ క్యారెక్టర్ ఏదో తేడా క్యారక్టర్ అనుకుంట అని అందరూ ఫిక్స్ అయిపోయిన్రు.

సర్లే తొమ్మిదిన్నరకి వస్తది కదా… ప్రోగ్రామ్ చూద్దం లే అనుకున్నరు. అక్కడి నుంచి వెయిట్ చేసి… తొమ్మిదిన్నరకి టీవీ9 పెట్టుకొని చూసిన్రు… యాంకరమ్మ ఇస్మార్ట్ న్యూస్ అంటే ఏంది అని ముందుగాల ఓ స్టోరీ చూపించినంక… రవి కంటే ముందుగాల ఇంకో క్యారెక్టర్ ను పరిచయం చేసింది. ఆయనది నారద పాత్ర. ఎక్కడికెక్కడికో పోయిండు. ముల్లోకాలు చుట్టు వచ్చిండు. లక్ష్మి, పార్వతి, సరస్వతితోటి మాట్లాడిండు. అదంతా ఎందుకు అర్థం కాలే. పైగా ఆ క్యారెక్టర్ చేసినోడు… నారాయణ… నారాయణ… అని పల్కుడు విచిత్రంగా అన్పించింది. చాలా కృతకంగా… పట్టి పట్టి అంటున్నడు. అస్సలు ఈజ్ లేదు. ఎందుకంత కష్టపడుతున్నడో సమజ్ అయితలేదు.

ఆ తర్వాత కొద్దిసేపటికి సత్తి అలియాస్ ఇస్మార్ట్ సత్తి వచ్చిండు… గణేష్ పూజ చేసిండు. ప్లోనే… వినాయకచవితి కదా… మంచిగనే షురూ చేసిండు అనుకున్నం. మా అన్న ఇంకొకడు ఉన్నడు… వాడు కవ్వాలీ చేస్తున్నడని … డబుల్ ఫోజు చూపిచ్చిండు. అక్కడ మొదలైంది రా నాయనా… కవ్వాలీ ఎంతసేపటికి ఆగదాయా… అసలు మనం చూస్తున్నది ఏంది… బుల్లి తెర మీద ఏమైతున్నదో అర్థం కాలేదు. జుట్టు పీక్కున్నం…
ఆ గానా భజానా అయినంక యాంకరమ్మ వచ్చి… ఇది ఇస్మార్ట్ న్యూస్ అని చెప్పింది.

ఇంతకీ ఇస్మార్ట్ న్యూస్ అంటే ఏంది… అసలు ఏం చెబుతున్నరు… ఏం చూపిస్తున్నరో ఇస్మార్ట్ న్యూస్ ల అర్థం కాలేదు… ముల్లోకాలకు వెళ్లినప్పుడు… చూపించిన గ్రాఫిక్స్ సెట్టింగ్స్ మాకున్నయ్ అని చెబుదం అనుకున్నరా ఏంది ? నాకైతే సమజ్ గాలే. అస్సలు వార్తలే ఇందులో లేవు… అరగంటల గానా భజనాకే టైమ్ పోయింది..మా ప్రెండు అన్నట్టు …ఈమధ్య రిలీజై… ప్లాఫ్ అయిన సినిమా మళ్ళోపాలి చూసొచ్చినా బాగుండేది అన్నడు… అది నిజమేనేమో అనిపించింది.

వీ6లో సత్తి క్యారెక్టర్ వేరు. అక్కడి స్క్రిప్ట్ వేరు. వీ6ల ఎన్ని క్యారెక్టర్లు ఉన్నా… ఎవరు బయటకు వెళ్ళినా… అక్కడ క్యారెక్టర్లే మీదే ప్రోగ్రామ్ ఆధారపడి లేదు. స్క్రిప్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏది పడితే అది రాసేసి… జస్ట్ తెలంగాణ స్లాంగ్ పెడితే చాలు అనుకుంటే మాత్రం.. పప్పులో కాలేసినట్టే. క్యారెక్టర్ల నటనకు తోడు.. SCRIPT…. దాంతో పాటే టేకింగ్ కూడా చాలా ఇంపార్టెంటే. వీటి మీద జాగ్రత్తలు తీసుకోనంత కాలం ఏ కార్యక్రమం అయినా వీ6 తీన్మార్ ముందు బలాదూరే అని మళ్ళోపాలి రుజువైంది.