ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మొదటి కేబినెట్ మీట్ లోనే పాలనపై తన వైఖరేంటో ఏపీ జనానికి చూపించారు. తాను ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలకు అనుగుణంగా అనేక కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఐదున్నర గంటల పాటు జరిగిన కేబినెట్ మీట్ లో ముఖ్యంగా ఉద్యోగులకు ఊరట నిచ్చే… CPS రద్దుపై కమిటీ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం. నిజానికి ఉద్యోగుల ఫించన్లకు సంబంధించిన ఈ నిర్ణయంపై గత కొన్నేళ్ళుగా ఉద్యోగులు పోరాటం చేస్తున్నారు. అందుకే ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు CPS రద్దు చేయడానికి నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం… దీనిపై న్యాయపరమైన చిక్కులు రాకుండా కమిటీని కూడా ఏర్పాటు చేసింది.

ఇక జగన్ తన నవరత్నాల్లో ఒక్కోటి అమలు చేస్తున్నారు. రైతు భరోసా, అమ్మఒడి కార్యక్రమాలను కూడా మొదలుపెట్టబోతున్నారు. అందుకోసం తేదీలు కూడా ఖరారు చేశారు సీఎం జగన్.
జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి, ఆశావర్కర్లకు 3 వేల నుంచి 10 వేలకి జీతాల పెంపు, అంగన్ వాడీ టీచర్లకి 10 వేల 500 నుంచి 11 వేల 500కు జీతాల పెంపు లాంటి అంశాలు ఉన్నాయి.

నిరుద్యోగులకు భరోసా !

ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులు ఎదురుచూస్తున్న గ్రామ సచివాలయ వ్యవస్థను అక్టోబర్ 2 నుంచి అమల్లోకి తెచ్చేందుకు జగన్ రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగా వాలంటీర్ల నిమామకం చేపట్టనుండటంతో చాలామందికి తాము ఉన్న ఊళ్ళోనో… లేదంటే ఆ పక్క గ్రామంలోనో ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంది. ఆగస్టు 15 కల్లా గ్రామ వాలంటీర్ల నియామకం జరగబోతోంది. పట్టణాల్లోని మున్సిపల్ వార్డుల్లో వాలంటీర్లకి డిగ్రీ అర్హత, గ్రామ వాలంటీర్లకు ఇంటర్ విద్యార్హత నిర్ణయించింది ఏపీ సర్కార్. ప్రతి 50ఇళ్ళకి ఓ వాలంటీర్ చొప్పున నియమించబోతున్నారు.

ఇంకా రైతు భరోసా, ఆడపడుచులకు ఉగాది కానుకగా ఇళ్ళ స్థలాలు కొని ఇవ్వడం, అమ్మఒడి పథకం, అగ్రి గోల్డ్ బాధితులకు అండగా నిలవడం లాంటి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఏపీ సీఎం జగన్.