జియో ఫైబర్ ని ఎదుర్కోడానికి ఎయిర్ టెల్, ACT ఫైబర్ ప్లాన్స్ !

టెలికాం రంగంలో జియో ఇప్పటికే సంచలనం సృష్టించింది. తమ ప్రత్యర్థులైన ఎయిర్ టెల్, వొడా ఫోన్, ఐడియాని కోలుకోలేని దెబ్బ తీసింది. ఇప్పుడు జియో గిగా ఫైబర్ పేరుతో వైర్డ్ నెట్ వర్క్ లోకి కూడా వస్తోంది జియో. ఇప్పటికే వైర్డ్ నెట్ వర్క్ లో ఉన్న ఎయిర్ టెల్ బ్రాడ్ బాండ్, ఆట్రియా కన్వెర్జెన్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ACT) ఫైబర్ నెట్ కి జియో రాకతో ఇబ్బందులు తప్పేలా లేవు.

జియో ఫైబర్ నెట్ కొన్ని ఏరియాల్లో ఇప్పటికే ప్రారంభమైంది. 3 నెలలు ఉచితంగా అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ ను అందిస్తోంది. చాలా తక్కువ రేట్లతోనే వైర్డ్ ఇంటర్నెట్ ను అందించేందుకు జియో ప్లాన్ చేస్తోంది. మొదట ఇంటర్నెట్ తో ప్రారంభం అవుతున్నా… తర్వాత కాలంలో జియో ఫోన్, DTH సర్వీసులను కూడా ఇదే వైర్ కింద వినియోగదారులకు అందించాలని జియో భావిస్తోంది. రిలయన్స్ ప్రారంభించిన రిజిష్ట్రేషన్ ప్రాసెస్ కు జనం నుంచి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తోంది. దేశంలో 5 కోట్ల ఇళ్ళకి వైర్డ్ నెట్ అందించాలని జియో గిగా ఫైబర్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇటు హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కనెక్షన్లు కూడా ఇస్తున్నారు.

ఇప్పటిదాకా వైర్డ్ నెట్ వర్క్ ను ఏలుతున్న ఎయిర్ టెల్, ACT ఫైబర్ నెట్ కి జియో రాకతో ఇబ్బందులు మొదలయ్యాయి. జియోని తట్టుకొని మార్కెట్లో నిలబడటానికి రక రకాల ప్రయత్నాలు ప్రారంభించాయి. ఒకప్పుడు వెయ్యి ఆ తర్వాత 6 వందలు పెట్టందే ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చేది కాదు… ఇప్పుడీ రెండు సంస్థలు రూ.400 నుంచి రూ.1500 రేంజ్ లో కూడా నెట్ కనెక్షన్ ప్లాన్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఇక పాత, కొత్త వినియోగదారులకు ఫోన్లు మీద ఫోన్లతో ఒకటే విసిగిస్తున్నారు ACT పైబర్ నెట్ సిబ్బంది.

జియోని తట్టుకొని మార్కెట్లో నిలబడాలంటే రేట్లు ఒక్కటి తగ్గిస్తే సరిపోదని అనుకుంటున్నాయి ఎయిర్ టెల్, ACT ఫైబర్ నెట్. అందుకోసం తమ వినియోగదారులకు వాల్యూ యాడెడ్ సర్వీసులు కూడా అందించేందుకు సిద్ధమవుతున్నారు.  ACT ఫైబర్ నెట్ కనెక్షన్ తీసుకుంటే నెట్ ఫ్లిక్స్ తో పాటు అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. ఇంతకుముందు ACT గూగుల్ హోమ్ ని కూడా తమ వినియోగదారులకు గిఫ్ట్ గా ఇచ్చింది. అంతేకాదు… ప్రస్తుత వినియోగదారులకు తాము తీసుకున్న ప్లాన్ కంటే అదనపు డేటాను అందిస్తోంది.

ఇక ఎయిర్ టెల్ అయితే అదనంగా 25శాతం డేటా బోనస్ ప్రకటించింది. ఏడాదికి వెయ్యి రూపాయల విలువైన అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ని ఉచితంగా ఇస్తోంది. భారతీ ఎయిర్ టెల్ తమ కార్యకలాపాలను 100 సిటీలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ట్రాయ్ లెక్కల ప్రకారం దేశంలో 18 మిలియన్ల మంది బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులు ఉన్నట్టు అంచనా. జియో గిగా ఫైబర్ తో ఈ సంఖ్య అనూహ్యంగా రెట్టింపు అయ్యే ఛాన్స్ ఉంది.