కేసీఆర్ బయోపిక్ 29న విడుదల !

ఇప్పటికే దేశంలో ఎన్నో బయోపిక్స్ వచ్చాయి. మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల ముందు కేసీఆర్ బయోపిక్ కూడా రాబోతోంది. ఈమధ్య కాలంలో ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు, లక్ష్మీస్ ఎన్టీఆర్, యాత్ర, పీఎం నరేంద్రమోడీ, ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్, థాకరే పైగా బయోపిక్స్ రెడీ అయ్యాయి. వీటిల్లో కొన్ని రిలీజ్ అయ్యాయి కూడా.

ఇప్పుడు కల్వకుంట్ల నాగేశ్వరరావు నిర్మాతగా ఉద్యమ సింహం పేరుతో ఈనెల 29న థియేటర్లలో రిలీజ్ అవుతోంది. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో కేసీఆర్ పోరాటం గురించి ఇందులో తెరకెక్కించారు. ఇందులో తెలంగాణ అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం, TRS ఎమ్మెల్యేలను వైఎస్సార్ తమ పార్టీలో కలుపుకోవడం, టీఆర్ఎస్ ఉద్యమం, కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష, NIMS హాస్పిటల్ ఎపిసోడ్, 2015లో ఓటుకి నగదు అంశాలతో పాటు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి వ్యతిరేకంగా ఆంధ్రనేతలు అడ్డుకున్న తీరును చూపించారు. అయితే దిబిరి దిబిరి పాటలో ఆంధ్రలీడర్స్ పై చూపించిన సన్నివేశాలపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం చెప్పారు. దాంతో వాటిని సెన్సార్ బోర్డు తొలగించింది. ఈ మూవీలో కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా ఉద్యమంలో ఎలా పోరాటం చేసిందీ చూపించబోతున్నారు.

అసలు ఈ మూవీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే 2018 డిసెంబర్ లోనే విడుదల కావాల్సి ఉంది. అయితే ఇందులో ఆంధ్ర సెటిలర్స్ కి వ్యతిరేకంగా చూపించడంతో … ఆ ప్రభావం గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లపై పడుతుందని గ్రహించారు. అందుకే దానికి సంబంధించిన సన్నివేశాల్లో మార్పులు చేసి… ఇప్పుడు లోక్ సభ ఎన్నికల ముందు ఉద్యమ సింహం సినిమాని రిలీజ్ చేయబోతున్నారు.