దేశంలో ఇక రాబోయేది ప్రాంతీయ పార్టీల కూటమియే !
బీజేపీ, కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం.
మాకు 16 ఎంపీ సీట్లు ఇవ్వండి. ఢిల్లీ మెడలు వంచుతాం. రాష్ట్రం హక్కులు సాధిస్తాం

సరిగ్గా లోక్ సభ ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) ప్రచారం ఇలాగే సాగింది. పార్టీ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్ తో పాటు ఆ పార్టీ సీనియర్లంతా ఇదే పంథాలో క్యాంపెయిన్ చేశారు. దేశంలో వివిధ ప్రాంతీయ పార్టీల నేతలు తమతో టచ్ లో ఉన్నారనీ… ఢిల్లీలో బీజేపీ, కాంగ్రేసేతర కూటమి ఏర్పాటు చేద్దామని చెప్పారు. కొందరు గులాబీ నేతలైతే… కేసీఆర్ ప్రధాని అవుతారని కూడా చెప్పుకొచ్చారు.

కానీ ఇప్పుడేం జరుగుతోంది ?

మరో 10 రోజుల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వస్తుండటంతో ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూటమికి బలం చేకూర్చే పనిలో పడ్డారు. ముందుగా దక్షిణాది రాష్ట్రాల్లోని వివిధ పార్టీల ముఖ్య నేతలను కలుసుకొని వస్తున్నారు. కేరళలో కేసీఆర్ కి పరిస్థితి సానుకూలంగానే అనిపించింది. ఎందుకంటే అక్కడున్నది కమ్యూనిస్టులు. తెలంగాణలో కమ్యూనిస్టులు కేసీఆర్ భావజాలాన్ని వ్యతిరేకిస్తున్నా… వాళ్ళకి మాత్రం కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వం కావాలి. అందుకే కేరళలో ఫెడరల్ ఫ్రంట్ కి సానుకూలత ఏర్పడింది.

కానీ నిన్న తమిళనాడు పర్యటనకు వెళ్లిన కేసీఆర్ కు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. అక్కడ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తో భేటీ అయిన కేసీఆర్… ఫెడరల్ ఫ్రంట్ లో చేరాలని కోరారు. పార్లమెంటులో 120కి పైగా సీట్లు ప్రాంతీయ పార్టీల చేతుల్లోనే ఉన్నాయని చెప్పుకొచ్చారు. NDA, UPA కి మ్యాజిక్ ఫిగర్ రాదనీ… అందువల్ల ఫెడరల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని కోరారు. గంటకు పైగా ఇద్దరు నేతలు చర్చించారు. అయితే మీటింగ్ లో కేసీఆర్ కి రివర్స్ గేర్ వేశారు డీఎంకే అధినేత. కేసీఆర్ నే కాంగ్రెస్ ఆధ్వర్యంలోని UPA కూటమిలోకి రావాలని కోరారు. తమిళనాడులో కాంగ్రెస్, డీఎంకే కలసి పోటీ చేశాయి. పైగా రాహుల్ గాంధీ ప్రధాని కావాలని మొదట ప్రతిపాదించేందే నేను అంటూ కాంగ్రెస్ తో తమ ఫ్రెండ్షిప్ ను వివరించారు డీఎంకే అధినేత స్టాలిన్. కేసీఆర్, స్టాలిన్ ఏం మాట్లాడుకున్నారు అన్న సస్పెన్స్ కొనసాగింది… అయితే కేసీఆర్ హైదరాబాద్ కు బయల్దేరే విమానంలో ఉండగానే… డీఎంకే నేతలు కాంగ్రెస్ తో తమ స్నేహాన్ని ట్విట్టర్ ద్వారా బయటపెట్టారు. కేసీఆర్ నే తమ కూటమిలోకి ఆహ్వానించినట్టు చెప్పారు.

దాంతో టీఆర్ఎస్ అధినేత అనుకున్నది ఒక్కటి… అయినది ఒక్కటి అన్నట్టుగా మారింది. గతంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా దేవెగౌడ, కుమార స్వామిని కలసి వచ్చారు కేసీఆర్. వాళ్ల దగ్గర కూడా ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదన తెచ్చారు. అప్పట్లో సానుకూలంగా మాట్లాడిన ఆ ఇద్దరు కన్నడ నేతలు… ఆ తర్వాత కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇప్పుడు తమిళనాడులోనూ అదే పరిస్థితి ఎదురైంది గులాబీ బాస్ కి.
ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశంలోని ప్రాంతీయ పార్టీలు… రెండు వర్గాలుగా విడిపోయాయన్నది స్పష్టంగా కనిపిస్తోంది.

ఒకటి – కాంగ్రెస్ కూటమి – అది యూపీయే
రెండు – బీజేపీ కూటమి – అది ఎన్డీయే

ప్రాంతీయ పార్టీల కూటమికి ఈశాన్య రాష్ట్రాల్లోని చిన్నా చితకా పార్టీలు తప్ప… పెద్ద పార్టీలేవీ మొగ్గు చూపే పరిస్థితి కనిపించడం లేదు. గతంలో ఎన్టీఆర్ ఉన్నప్పుడో… ఆ తర్వాతో… ప్రాంతీయ పార్టీలు ఢిల్లీలో చక్రం తిప్పగలిగాయి… ఈ ప్రాంతీయ పార్టీలు నిజంగా తమ రాష్ట్రాల్లో బలం కలిగి ఉన్నా… కేంద్రంలోకి వచ్చే సరికి ఏదో ఒక కూటమికి జై కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీ పడాల్సి వస్తోంది. ఒక్క ఒడిషా మినహా… దేశంలో దాదాపు ఏ పార్టీ కూడా న్యూట్రల్ గా ఉండే అవకాశం లేదు.

ఈ పరిస్థితుల్లో ఫెడరల్ ఫ్రంట్ ఎంతవరకూ వర్కవుట్ అవుతుంది.. ?
ఢిల్లీలో ప్రాంతీయ పార్టీలు చక్రం తిప్పడం సాధ్యమేనా ?

అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

అదే టైమ్ లో గులాబీ బాస్ కేసీఆర్ ప్లాన్ సాధ్యమవుతుందా… ఒకవేళ రేపు కేంద్రంలో కాంగ్రెస్ లేదా బీజేపీ కూటమి ఏర్పడితే వాటికే మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా అన్నది… ఈనెల 23 తర్వాత గానీ తెలియదు.