అనుకున్నట్టే అయింది… టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ చెన్నై పర్యటన సక్సెస్ కాలేదు.. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో దేశంలోని ప్రాంతీయ పార్టీలను ఒక్క తాటిపైకి తీసుకొద్దామనుకున్న కేసీఆర్ ఆలోచనలకు ఆదిలోనే ఎదురు దెబ్బలు తగిలింది.

నిన్న చెన్నై వెళ్ళి డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ని కలిసొచ్చారు కేసీఆర్. ఫెడరల్  ఫ్రంట్ లో చేరాలని కోరారు. గంట సేపు ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు కూడా. ఆ తర్వాత కేసీఆర్ ఫ్లయిట్ ఎక్కగానే… తామే కేసీఆర్ ను UPA లో చేరమని కోరినట్టు DMK వర్గాలు ట్వీట్ చేశాయి. అంతటితో ఆగకుండా ఇవాళ స్టాలిన్ చేసిన కామెంట్స్… గులాబీ బాస్ ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టాయి.

కేసీఆర్ తమిళనాడు పర్యటన కేవలం దైవ దర్శనాల కోసమే అని కామెంట్ చేశారు స్టాలిన్. ఆయనతో  జరిగిన భేటీ మర్యాద పూర్వకమే అన్నారు. వాస్తవానికి ఈ మీటింగ్ వారం, పది రోజుల ముందే జరగాల్సి ఉన్నా… ఎలక్షన్స్ బిజీ అంటూ కేసీఆర్ కి స్టాలిన్ టైమ్ ఇవ్వలేదు. తీరా ఇప్పుడు కలిసిన తర్వాత దేవుళ్ళను చూట్టానికే కేసీఆర్ వచ్చారని కామెంట్ చేశారు. కూటమి ఏర్పాటు ప్రయత్నాల కోసం మాత్రం  కాదనన్నారు. అంతేకాకుండా… లోక్ సభ ఫలితాల తర్వాత కాంగ్రెస్, బీజేపీయేతర కూటమికి ఎలాంటి అవకాశం లేదని కూడా స్టాలిన్ కొట్టిపారేశారు. దాంతో ఫెడరల్ ఫ్రంట్ కి ఎంతమంది కలిసొస్తారన్నది డౌట్ గా మారింది.