మసూద్ అజార్ అంతర్జాతీయ ఉగ్రవాది

భారత్ ఒత్తిడి ఫలించింది. ఎట్టకేలకు జైషే మహహ్మద్ అధినేత మసూద్ అజార్ ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. పాకిస్తాన్ కు చెందిన మసూద్ ను అంతర్జాతీయ టెర్రరిస్టుల జాబితాలో చేర్చాలని భారత్, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా దేశాలు ఒత్తిడి చేస్తున్నాయి. అయితే ప్రతిసారీ చైనా అడ్డుపడుతోంది. ఇప్పటికే నాలుగు సార్లు అజార్ ను బ్లాక్ లిస్టులో పెట్టకుండా అడ్డుకుంది చైనా.

అజార్ భారత్ లో ఎన్నో ఉగ్రవాద పేలుళ్ళకి పాల్పడ్డాడు. తాజాగా ఫిబ్రవరి 14న జమ్ము కశ్మీర్ లోని పుల్వామాలో జవాన్ల వెహికిల్స్ పై జరిగిన దాడిలో 41 మంది జవాన్లు చనిపోయారు. ఈ దాడికి తామే కారణమని జైషే మహ్మద్ బహిరంగంగా చెప్పుకుంది. అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐరాస అజార్ ను గుర్తించడంతో అతని ఆస్తులను జప్తు చేయడానికి ఆయా దేశాలకు అధికారం ఉంటుంది. ఈ విషయంలో పాకిస్తాన్ కూడా తప్పనిసరిగా మసూద్ అజార్ ఆస్తులను జప్తు చేయాల్సి ఉంటుంది.