యూట్యూబ్, టీవీ ఛానెల్స్ లో ఉచితంగా ఉద్యమ సింహం !

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ గా, తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చిన సినిమా ఉద్యమ సింహం. ఈనెల 29న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే కొందరు ఈ మూవీ రిలీజ్ కాకుండా అడ్డంకులు సృష్టించినట్టు నిర్మాత కల్వకుంట్ల నాగేశ్వరరావు తెలిపారు. దాంతో ఉద్యమ సింహం మూవీని యూట్యూబ్, టీవీ ఛానెల్స్ లో ఉచితంగా ప్రదర్శిస్తున్నట్టు తెలిపారు. మా సినిమాను ప్రదర్శించ వద్దని డిస్ట్రిబ్యూటర్లు, సినిమా థియేటర్స్ ఓనర్లను కొందరు బెదిరించారు. దాంతో తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలన్న ఉద్దేశ్యంతో యూట్యూబ్ లో విడుదల చేశామన్నారు. అలాగే ఈ చిత్రానికి కాపీ రైట్స్ సమస్య లేదనీ… ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించారు నిర్మాత. ఇందులో నటరాజన్, మాధవి రెడ్డి, జలగం సుధీర్, లత నటించారు. అల్లూరి కృష్ణం రాజు ఉద్యమ సింహం సినిమాకి దర్శకత్వం వహించారు.