ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి పదేళ్ళుగా గవర్నర్ పదవిలో ఉండి దేశంలోనే రికార్డు సృష్టించారు ESL నరసింహన్. ఆంధ్రప్రదేశ్ విడిపోయేటప్పుడు వచ్చిన ఉద్యమాలు, విడిపోయాక వచ్చిన విభజన సమస్యలను కూడా చాకచక్యంగా డీల్ చేశారన్న మంచి పేరు నరసింహన్ కు ఉంది. దాంతో ఆయన సేవలను కేంద్ర స్థాయిలో వాడుకోవాలని మోడీ సర్కార్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ఇండియన్ పోలీస్ సర్వీసెస్ ఆఫీసర్ గా రిటైర్డ్ అయిన నరసింహన్ కు గతంలో ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసిన అనుభవం కూడా ఉంది. దాంతో ఆయన సేవలను మోడీ టీమ్ లో వాడుకోవాలని చూస్తున్నారు. అందుకోసం జాతీయ భద్రతా సలహాదారు ధోవల్ టీమ్ లో నరసింహన్ కు ప్లేస్ ఇస్తారన్న టాక్ నడుస్తోంది. ముఖ్యంగా నరసింహన్ IPS కేడర్ అధికారి కావడంతో ఆయన సేవలను జమ్ము కశ్మీర్ వ్యవహారాల్లో వాడుకోవాలని చూస్తున్నారు.

జమ్ము కశ్మీర్ లో ఓ వైపు ఉగ్రవాద దాడులు, మరోవైపు కీలకమైన 370 ఆర్టికల్ సవరణ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో జమ్ముకశ్మీర్ శాంతి భద్రతలను కంట్రోల్ పెట్టడం అనేది కేంద్ర ప్రభుత్వానికి సవాల్ గా మారింది. అందుకే నరసింహన్ సేవలను గవర్నర్ పదవిలో కాకుండా జాతీయ భద్రతా సలహా విభాగంలో వాడుకోవాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచనగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

మరికొన్ని రోజుల్లో రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు రాబోతున్నారు. ఈ మార్పులు, చేర్పుల్లోనే ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ప్లేస్ మారే ఛాన్స్ కనిపిస్తోంది.