బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తుండగా నీరవ్ మోదీ అరెస్ట్ !

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండన్ లో తలదాచుకున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. రూ.13,500కోట్ల కుంభకోణం తర్వాత విదేశాలకు పారిపోయి, లండన్ లో తలదాచుకున్నాడు. నగదు అక్రమ చలామణి కేసుల్లో ఆయన్ని అప్పగించాల్సిందిగా ఎన్ ఫోర్స్ మెంట్ కోర్టు బ్రిటన్ హోంమంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేసింది. దాంతో నిన్న లండన్ బ్యాంక్ లో ఖాతా ఓపెన్ చేసేందుకు వెళ్ళినప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మాల్యా కంటే ముందే భారత్ కి నీరవ్

విజయ్ మల్యా కేసు కన్నా ఫాస్ట్ గానే నీరవ్ మోదీ కేసు లండన్ కోర్టులో మూవ్ అయ్యే అవకాశముందని CBI, ED వర్గాలు భావిస్తున్నాయి. బ్యాంకు మోసం, అక్రమ నగదు చలామణికి సంబంధించి నీరవ్ మోదీపై పటిష్టమైన సాక్ష్యాలు ఉండటంతో ఆయన్ని భారత్ కు తొందర్లోనే తీసుకొచ్చే ఛాన్సుంది. ఇలాంటి ఆరోపణలున్న వారిని అప్పగించేందుకు బ్రిటన్ చట్టాలు త్వరగా ప్రాసెస్ చేసే అవకాశముంది. అయితే యూకే కోర్టులో నీరవ్ మోదీ కేసు 6 నుంచి 9 నెలల వరకూ క్లియర్ అయ్యే ఛాన్సుంది. విచారణ ప్రారంభానికి ఇంకా 2 వారాలు పడుతుంది. CBI, ED వర్గాలు కూడా 6 నెలల్లోపే నీరవ్ మోడీని ఇండియాకి తీసుకొస్తామంటున్నాయి. మరోవైపు – మాల్యా కేసు మాత్రం 2 నుంచి 3 సంవత్సరాల దాకా కొనసాగే అవకాశముంది.

వేషం మార్చినా దొరికాడు

నీరవ్ మోదీ లండన్ లో తలదాచుకుంటున్నట్టు టెలిగ్రాఫ్ జర్నలిస్ట్ ఇంటర్వ్యూతోనే వెలుగులోకి వచ్చింది. బ్రిటన్ కు చెందిన జర్నలిస్ట్ మిక్ బ్రౌన్ దీనికి సంబంధించి ఈనెల 9న టెలిగ్రాఫ్ లో ఓ కథనం ఇచ్చారు. లండన్ లోని వెస్ట్ ఎండ్ వీథుల్లో వేషం మార్చుకొని కనిపించిన నీరవ్ మోదీని ఆ జర్నలిస్ట్ గుర్తుపట్టాడు. అక్కడ 80 లక్షల పౌండ్ల విలువైన అంటే .. 72 కోట్ల విలువైన అపార్ట్ మెంట్ లో ఉంటున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించి మొబైల్ లో తీసిన ఓ వీడియోని కూడా టెలిగ్రాఫ్ పత్రిక జర్నలిస్ట్ ఉంచారు. దాంతో నీరవ్ ఆచూకీ ప్రపంచానికి వెలుగులోకి వచ్చింది.