హవ్వ… పాకిస్తాన్ పాట కాపీ కొట్టారా ?

శ్రీరామనవమి సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రతియేటా విడుదల చేసే స్పెషల్ సాంగ్ వివాదస్పదంగా మారింది. తమ పాటను కాపీ చేసి మార్చుకున్నారని పాకిస్తాన్ ఆర్మీ ట్వీట్ చేయడంతో దుమారం రేగుతోంది.
పాతబస్తీలో ప్రతియేటా శ్రీరామనవమి శోభాయాత్రను ఘనంగా నిర్వహిస్తుంటారు ఠాకూర్ రాజాసింగ్. పార్టీతో సంబంధం లేకుండా హనుమాన్, శ్రీరామ నవమి శోభాయాత్రలను ఆయన నిర్వహిస్తారు. ఈ సందర్బంగా ప్రతియేటా ఓ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేయడం రాజాసింగ్ కి అలవాటు. అందులో భాగంగానే ఈసారి భారత సైనికులకు అంకితం చేస్తూ ఈ పాటను రిలీజ్ చేస్తున్నట్టు రాజాసింగ్ ట్వీట్ చేశారు. ఈనెల 14న ఉదయం 11.45కు ఈ సాంగ్ రిలీజ్ అయింది.
అయితే ఈ పాటను రాజా సింగ్ కాపీ కొట్టారని ఆరోపిస్తోంది పాకిస్తాన్ సైన్యం. మార్చ్ 23న పాకిస్తాన్ డే సందర్బంగా సాహిర్ అలీ బగ్గా రాసిన పాటను కాపీ చేశారని అంటోంది. పాకిస్తాన్ లోని ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ అసిఫ్ ఘఫూర్ … ఈ పాట గురించి ట్వీట్ చేశారు. దిల్ కి హిమ్మత్ వతన్, అప్నా జస్బా వతన్… అనే ఈ పాటలో పాకిస్తాన్ జిందాబాద్ కి బదులు హిందూస్తాన్ జిందాబాద్ అని మార్చి కంపోజ్ చేసినట్టు పాక్ ఆర్మీ చెబుతోంది.
మరోవైపు రాజాసింగ్  మాత్రం తన పాటను కొన్ని నెలల ముందే కంపోజ్ చేస్తాననీ… అందువల్ల తన పాటనే పాకిస్తాన్ వాళ్ళుకాపీ చేసి ఉండొచ్చని చెబుతున్నారు. ఈ వివాదంపై బీజేపీ వర్గాలు మాత్రం దూరంగా ఉంటున్నాయి. అది రాజా సింగ్ వ్యక్తిగత వ్యవహారమని చెబుతున్నాయి.