మన ప్రయత్నమే మనల్ని గట్టెక్కిస్తుంది ! మన పట్టుదలే మనల్ని గెలిపిస్తుంది !!

గాలిలో దీపం పెట్టి … నువ్వే దిక్కు అంటే ఎలా ? అని మన పెద్దలు మనల్ని ఎన్నోసార్లు ప్రశ్నించి ఉంటారు. అవును ఇది కరెక్టే. మానవ ప్రయత్నం లేకుండా ఏ పని అయినా ఎలా సాధ్యమవుతుంది. దేవుడికి వెయ్యి కొబ్బరి కాయలు కొట్టి… మన ప్రయత్నం ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చుంటే ఏ పనీ దానంతట అదే జరగదు. అలాగని దేవుడిని నమ్మొద్దని కాదు… మన ప్రయత్నం చేస్తూనే దేవుడిని ప్రార్థించుకోవాలి. అప్పుడు మానసికంగా మనం ధృడత్వాన్ని కలిగి ఉంటాం. సో… మనం ఏ పని చేసినా అది తప్పనిసరిగా జరిగి తీరుతుంది.

ఉదాహరణకు మీరు ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారనుకోండి… ఏం చేయాలి… ముందుగా ప్రణాళిక వేసుకోవాలి. ఏ టైమ్ వరకూ ఏ సబ్జెక్ట్ పూర్తి చేయాలన్నదానిపై అవగాహనకు రావాలి. గతం ప్రశ్నాపత్రాలను ఒక్కసారి చూసుకోవాలి… అప్పటికీ ఇప్పటికీ వస్తున్న మార్పులను గమనించాలి. అప్పుడు ప్రతి సబ్జెక్ట్ పై మీకో అవగాహన వస్తుంది. మనం పరీక్ష రాయబోయే తేదీ ఎప్పుడు… ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి… అప్పటిలోగా ఎన్ని చాప్టర్లు చదవాలి… ఏయే చాప్టర్లు చాలా ఇంపార్టెంట్. రిపీట్ చేసుకోడానికి ఎంత టైమ్ కేటాయించాలి. రోజులో విశ్రాంతి ఎప్పుడు తీసుకోవాలి… ఎన్ని గంటలు చదవాలి… ఇలాంటి ప్రతిదీ ప్లానింగ్ ఉంటేనే మనం అనుకున్నది సాధించగలం.
పుస్తకం తీయగానే విసుగు అనిపించి… స్మార్ట్ ఫోన్ తీసి సోషల్ మీడియాలో లైకులు కొట్టుకుంటూ ఉంటే మిమ్మిల్ని ఎవరూ బాగు చేయలేరు. ఆలోచించండి… మన జీవితానికి ముఖ్యమైనది ఏంటి ? ఆ లక్ష్యాన్ని ఎలా సాధించాలి అన్నదే మన మెదడులో తిరుగుతుండాలి. ఆ ఉద్యోగం లేదా ఆ పరీక్ష పాస్ అవడం వల్ల మనకు సమాజంలో వచ్చే గౌరవాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఇది ఎప్పుడూ రీల్ లాగా మీ మెదడు తొలిచివేస్తూ ఉండాలి. అప్పుడే మనం మన టార్గెట్ ను గురిచూసి కొట్టగలుగుతాం…

ఎవరో కొందరు మెస్సేజ్ లు పెడతారు… ఇది 20 మందికి పంపితే నువ్ శుభవార్త వింటావ్. లేకపోతే చస్తావ్ అని… నాన్సెస్ … దేవుడు ఎప్పుడూ మనకు లాగా చెడును కోరుకోడు. ముందు ఇలాంటి మెస్సేజ్ లు పంపేవాడి మైండ్ ని వాష్ చేయండి… ఆ మెస్సేజ్ ని 20 మందికో, 10 మందికో పంపినంత మాత్రాన… మీకు శుభం జరుగుతుందని ఎప్పుడూ అనుకోవద్దు.
గుర్తుంచుకోండి… మానవ ప్రయత్నం లేనిదీ ఏ పనీ జరగదు. మీ సంకల్పమే మిమ్మల్ని విజయపథం వైపు నడిపిస్తుంది.