తెలంగాణలో పదో తరగతి ఫలితాలు ఇంకా రాలేదు. ఇంకో మూడు వారాల టైమ్ పట్టే అవకాశముంది. అయితేనేం… ఇంటర్ అడ్మిషన్లు చక చకా అయిపోతున్నాయి. ప్రైవేటు  కాలేజీలు ముందస్తు ఆఫర్లతో తల్లిదండ్రులను బుట్టలో వేసుకుంటున్నారు.

హైదరాబాద్ లోని ప్రైవేటు కాలేజీలు అన్నీ ఇదే పద్దతి అవలంభిస్తున్నాయి. విద్యార్థులు పదో తరగతి ఎగ్జామ్స్ రాసిన స్కూళ్ళ నుంచి వివరాలు తెచ్చుకున్నాయి ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు. టెన్త్ ఎగ్జామ్స్ మొదలవ్వక ముందు నుంచే బేరసారాలు మొదలుపెట్టాయి. తల్లిదండ్రులకు ఫోన్లు చేసి… మీ పాప లేదంటే బాబుని మా కాలేజీలో చేర్చండి. ముందుగానే ఫీజు కడితే మీకు కన్సేషన్ ఉంటుంది. టెన్త్ ఫలితాలు వచ్చాక వస్తే.. అప్పుడు ఫీజు ఎక్కువగా ఉంటుంది. పైసా కూడా తగ్గించడం కుదరదు అంటూ అడ్వాన్స్ బుకింగ్స్ చేయించుకున్నారు. కాలేజీలు 2 నుంచి 10 వేల రూపాయల  దాకా అడ్వాన్స్ పేమెంట్స్ కట్టించుకొని తల్లిదండ్రులను గ్రిప్ లో పెట్టుకున్నారు. కొన్ని కాలేజీలైతే ఇంటర్ పుస్తకాలు, మెటీరియల్ కోసం కూడా డబ్బులు తీసుకున్నాయి. అసలు ఇంటర్ బోర్డు ఇంకా అడ్మిషన్ల ప్రక్రియనే ప్రారంభించలేదు. అయినా హైదరాబాద్ లోని చాలా కార్పొరేట్ కాలేజీల్లో సగానికి పైగా ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు పూర్తయ్యాయి.

ఇంటర్ ఫలితాల ప్రకటనతో గందరగోళంలో ఉన్న బోర్డు ప్రస్తుతం ప్రైవేటు కాలేజీలను పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. ఒక్క ఈ ఏడాదే కాదు… ప్రతి యేటా ఇలా బోర్డు ప్రకటన కంటే ముందే ప్రైవేటు జూనియర్ కాలేజీలు, కార్పొరేట్ కాలేజీలు ఇంటర్  అడ్మిషన్లు పూర్తి చేస్తున్నా అడిగేవారు లేరు. కల్లిబొల్లి కబుర్లతో తల్లిదండ్రులను ఎంతో కొంత అడ్వాన్స్ రూపంలో కట్టించుకొని… వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాయి…. ఇంటర్ కాలేజీలు. బోర్డు అధికారులకు లంచాలు ఇవ్వడం వల్లే ప్రైవేటు కాలేజీల దందా కొనసాగుతోందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇంటర్ బోర్డు అధికారుల ఇళ్ళపై ACB దాడులు చేస్తే అన్ని సంగతులు బయటపడతాయని అంటున్నాయి.

శనివారం హబ్సిగూడలోని నారాయణ కాలేజీలో జరుగుతున్న అడ్మిషన్లపై విద్యార్థి సంఘాల నేతలు ధర్నా చేశారు.  నిబంధనలకు విరుద్ధంగా ఇంటర్ అడ్మిషన్లు చేస్తున్నారని మండిపడ్డారు. అటు సిబ్బంది కూడా తాము చేస్తోంది తప్పని తెలిసినా…విద్యార్థి సంఘ నేతలతోనే వాగ్వాదానికి దిగారు.   ఇంటర్ బోర్డు తమను ఏమీ చేయలేదన్న ధీమాతోనే అని ఆరోపించారు విద్యార్థి సంఘ నాయకులు.