మొబైల్ ఫోన్లకు కూడా రాన్సమ్ వేర్ వైరస్ ముప్పు పొంచి ఉందని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యుత్ సంస్థల వెబ్ సైట్స్ ను కొందరు హ్యాకర్లు హ్యాక్ చేశారు. వాటిల్లో రాన్సమ్ వేర్ వైరస్ ను చొప్పించి, వెబ్ సైట్స్ పనిచేయకుండా చేశారు. ఆ తర్వాత వీటిని నిర్వహిస్తున్న TCS సంస్థ వెబ్ సైట్స్ ను పునరుద్దరించింది. అయితే ముప్పు ఇంతటితో అయిపోలేదని చెబుతున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.

సైబర్ నేరగాళ్ళు మొబైల్ ఫోన్లలో మాల్ వేర్, రాన్సమ్ వేర్ దాడులు చేస్తున్నట్టు గుర్తించారు. ఆన్ లైన్ ద్వారా చెల్లింపులు చేస్తున్నవారే వీళ్ల టార్గెట్. వీళ్ళు ముందు జాగ్రత్తలు తీసుకోకుండా మొబైల్ ఫోన్లలో వైరస్ రావడంతో పనిచేయకుండా పోవడమే కాదు… బ్యాంకులు, వ్యాలెట్స్ లో ఉన్న ఈ సొమ్ములను కూడా సైబర్ నేరగాళ్ళు మాయం చేసే అవకాశముంది. మనలో చాలా మంది సెల్ ఫోన్లు, కంప్యూటర్లలో పైరేటెడ్ Windows XP వాడుతున్నారు. దాన్ని వాటిపై దాడి చేయడం సైబర్ నేరగాళ్ళకి ఈజీ అవుతోంది.

కోట్లు, లక్షలు డిమాండ్ చేస్తున్న సైబర్ నేరగాళ్ళు

రెండు తెలుగు రాష్ట్రాల విద్యుత్ సంస్థల్లో రాన్సమ్ వేర్ వైరస్ చొప్పించిన నేరగాళ్ళు 35 కోట్లు డిమాండ్ చేశారు. ఇప్పుడు మొబైల్ ఫోన్లలో ఈ వైరస్ ను ప్రవేశపెడుతున్న వీళ్ళు లక్షల్లో డిమాండ్ చేస్తున్నారు. రాన్సమ్ వేర్ బారిన పడ్డ కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు వదిలేయడమే బెటర్ అని సలహా ఇస్తున్నారు సైబర్ క్రైమ్ నిపుణులు. సెల్ ఫోన్లు, మొబైల్ ఫోన్లలో సమాచారాన్ని సురక్షితంగా డ్రైవ్స్ లో భద్రపరుచుకోవడం బెటర్. ఒకవేళ ఎవరైనా దాడి చేశారని అనుమానం వస్తే కంప్యూటర్ లేదా మొబైల్ కి ఇంటర్నెట్ వాడకపోవడం బెటర్ అని సూచిస్తున్నారు.