రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్ మెంట్ వయస్సును 61యేళ్ళకు పెంచాలన్న సర్కార్ నిర్ణయంపై నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. దాంతో తమ ఉద్యోగ అవకాశాలు పోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ః

నిధులు – నియామకాల పేరుతో ఏర్పడ్డ తెలంగాణలో నిరుద్యోగులకు అనుకున్న స్థాయిలో ఉద్యోగాలు రాలేదు. చాలా ఉద్యోగాలు కోర్టు కేసుల్లో నలుగుతున్నాయి. ఇప్పటి రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలకు పైగా ఖాళీలు ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన మొదటి ప్రెస్ మీట్ లో కూడా నిరుద్యోగులకు కొలువులు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ వాగ్దానం చేశారు. కానీ ఇప్పుడు ఆ ఉద్యోగాల సంగతి పట్టించుకోకుండా… పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితిని పెంచాలన్న నిర్ణయంతో నిరుద్యోగుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. తెలంగాణ ఎగ్జామ్స్ తరపున నిర్వహించిన సర్వేలో చాలామంది అభ్యర్థులు రిటైర్మెంట్ ఏజ్ పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికే జీతంతో పాటు అనేక రకాల బెనిఫిట్స్ ఉద్యోగులు పొందుతున్నారనీ… తాము మాత్రం పైసా డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు.

ఓయూలోనూ నిరసన

ప్రభుత్వ ఉద్యోగులు, వైద్య ప్రొఫెసర్ల వయోపరిమితిని పెంచడంపై ఉస్మానియా యూనివర్సిటీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ ఛైర్మన్ కోటూరి మానవతా రాయ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. రిటైర్డ్ ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో నిరుద్యోగులతో ఆ కొలువులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు వేయాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితి, PRC పై నిర్ణయాన్ని వచ్చే కేబినెట్ సమావేశానికి వాయిదా వేసింది ప్రభుత్వం. అయితే ఈలోగా రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో వయసు పెంపుపై పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని విద్యార్థి, నిరుద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు నిరుద్యోగ సంఘాల నాయకులు.