హైదరాబాద్:
హమ్మయ్యా… ఎట్టకేలకు పంచాయతీ సర్పంచ్ ల మొరను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలకించింది. సర్పంచ్ లు, ఉపసర్పంచ్ లకు జాయింట్ చెక్ పవర్ కల్పిస్తూ జీవో జారీచేసింది. గ్రామపంచాయతీ పాలక వర్గాలు ఏర్పడిన ఏడాది తర్వాత గానీ ప్రభుత్వం స్పందించలేదు. పంచాయతీల్లో అభివృద్ధి నిధులు ఉన్నా… మొన్నటిదాకా వాడుకోలేని పరిస్థితి సర్పంచ్ లది. గతంలో సర్పంచ్, గ్రామపంచాయతీ కార్యదర్శికి జాయింట్ చెక్ పవర్ ఉండేది. ఆ తర్వాత కొత్తగా వచ్చిన గ్రామపంచాయతీ చట్టంలో చెక్ పవర్ ను సర్పంచ్, ఉపసర్పంచ్ లకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయినా దీనిపై ఎలాంటి జీవో జారీ కాలేదు. దాంతో పంచాయతీ పాలకమండలి ఏడాదిగా ఎలాంటి అభివృద్ధి పనులూ చేపట్టలేకపోయింది. కనీసం వీధి లైట్లు, డ్రైనేజులు క్లీనింగ్, రోడ్ల నిర్వహణ లాంటి ప్రాథమిక పనులను కూడా పంచాయతీ చేయలేకపోయింది. ఆఖరికి సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బుల్లేక… ఇటీవల కొన్ని జిల్లాల్లో సర్పంచ్ లు గ్రామంలో భిక్షాటన చేస్తూ తమ నిరసన తెలిపారు. ఇంకొందరైతే డ్రైనేజీ పనులు నిలిచిపోవడంతో తామే స్వయంగా డ్రైనేజీల్లోకి దిగి పనులు చేశారు.
గత రెండు, మూడు నెలల నుంచి సర్పంచ్ ల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతుండటంతో ఏడాది ఆలస్యంగానైనా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే జాయింట్ చెక్ పవర్ నిర్ణయం ఉపసర్పంచ్ లకు కూడా బాగా కలిసొచ్చింది. గతంలో పంచాయతీ కార్యదర్శికి ఉన్న ఈ పవర్ ఇకపై ఉపసర్పంచ్ లకు ఉంటుంది. గత పంచాయతీ ఎన్నికల్లో… ఊళ్ళో పలుకుబడి కలిగి… కాస్తో… కూస్తో… చక్రం తిప్పుదాం అనుకున్నవాళ్ళంతా వార్డు మెంబర్స్ గా పోటీ చేసి గెలిచిన తర్వాత ఉపసర్పంచ్ లు అయ్యారు. ఇప్పుడు జాయింట్ చెక్ పవర్ రావడంతో తాము అనుకున్న లక్ష్యం నెరవేరిందని సంబుర పడుతున్నారు.