సూర్య నమస్కారాలు ఎందుకు చేయాలి ?

ప్రతిరోజూ ఉదయం చేసే సూర్య నమస్కారం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.  ప్రతి రోజూ సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది… ఇందులో ఉండే 12 భంగిమలు మన బరువు తగ్గించుకోడానికి ఉపయోగపడతాయి. ప్రతి రోజూ మీరు నిద్ర లేవగానే సూర్య నమస్కారం చేస్తే ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. సూర్య నమస్కారాలను సాధారణంగా చాలామంది ఇండోర్ లో చేస్తుంటారు. దీనికంటే బయటి ప్రదేశంలో చేయడమే ఉత్తమం. ఎందుకంటే మనకు ఉదయాన్నే వచ్చే ఎండ చాలా ముఖ్యం. ఈ సూర్య రశ్మి నుంచి డి విటమన్ వస్తుందని మీకు తెలుసు. ఇప్పుడు చాలామందికి ఈ డి విటమన్ తక్కువవుతోంది. నిరంతరం ఏసీ గదుల్లో పనిచేస్తూ, నిద్రిస్తూ ఉండటం వల్ల డి విటమన్ లోపాన్ని నివారించుకోవడం కోసం మందులు వాడాల్సి అవసరం ఏర్పడింది. ఉదయాన్నే సూర్యరశ్మితో ఉచితంగా వచ్చే డీ విటమన్ ని కాదని మందులు వాడటం మనకు అవసరమా … ఆలోచించండి. డీ విటమన్ తో ఎముకల్లో పటుత్వం ఏర్పడుతుంది. ఒక్క డీ విటమన్ కోసమే కాదు… శరీరంలోని జీవక్రియల రేటు పెరగడంతో పాటు, అప్పటిదాకా నిద్రావస్థలో ఉన్న హార్మోనులను కూడా ఈ సూర్య నమస్కారాలు ఉత్తేజపరుస్తాయి. అందుకే వీటితో కేవలం బరువు మాత్రమే తగ్గుతామని అనుకోవద్దు.
సూర్య నమస్కారాన్ని 12 భంగిమల్లో విడివిడిగా చేస్తాం. దీనివల్ల శరీరంలో అదనపు క్యాలరీస్ బర్న్ అవుతాయి.

సూర్య నమస్కారాలు మొదలు పెట్టే ముందు కొంత స్ట్రెచ్చింగ్ అవసరం. చిన్న చిన్న స్ట్రెచింగ్ భంగిమలు చేయడం వల్ల కండరాలు ఫ్రీ అవుతాయి. ఆ తర్వాత మీరు చేసే సూర్య నమస్కారం వల్ల శరీరంలోని ప్రతి ఒక్క కండరంలో కదలికలు ఏర్పడతాయి. వీటితో థైరాయిడ్ గ్రంథులు సమర్థవంతంగా పనిచేస్తాయి. అప్పుడే బరువు పెరగడం లాంటి సమస్యలు ఉత్పన్నం కావు. ఒత్తిడి తగ్గించడంలో సూర్యనమస్కారాలు కీలకంగా వ్యవహరిస్తాయి. ఇవి చేస్తున్నప్పుడు దీర్ఘంగా, లోతుగా శ్వాస తీసుకుంటాం. దీని వల్ల మనలో ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. అలాగే మలమద్దక సమస్యలు కూడా రెక్టిఫై అవుతాయి. పైల్స్ సమస్యలు ఉంటే తొలగుతాయి.

నిద్రలేమి నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా సూర్య నమస్కారాలు చేయండి. ఈ భంగిమలతో రాత్రుళ్ళు హాయిగా నిద్ర పడుతుంది. సూర్య నమస్కారంతో ప్రతి అవయవంలోనూ కదలిక కనిపిస్తుంది. దాంతో రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది. దీని వల్ల మనం రోజుటి కంటే ఎక్కువ ఎనర్జీతో పనిచేయగలుగుతాం. మహిళల్లో పీరియడ్స్ సమస్యలకు కూడా సూర్య నమస్కారాలు చక్కని పరిష్కారంగా చెప్పవచ్చు. వివిధ భంగిమల్లో సహజంగా తీసుకునే శ్వాసతో వారిలో హార్మోనులను బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే మహిళలు, పురుషుల్లో మంచి శరీరాకృతి ఏర్పడుతుంది. స్కిన్ బాగుంటుంది. రెగ్యులర్ గా సూర్య నమస్కారం చేయడం వల్ల ముడతలు పోయి మెరిసే చర్మం సొంతం అవుతుంది. శరీరంలో వాతం, పిత్తం, ఖఫంకు సహాయపడుతుంది.