త్వరలో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ !

జాతీయ స్థాయిలో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ తరహాలోనే తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (TAS) ను ప్రారంభించే ఆలోచనలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న సీఎస్ తో పాటు ఇతర శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ఇందులో రెవెన్యూ, మున్సిపల్ శాఖల్లో పాలనా సంస్కరణలు చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ( TAS) ను ఏర్పాటు చేసే దిశగా ఉన్నతాధికారులు చర్యలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కేంద్రంలో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ తరహాలోనే ఇది కూడా ఉండాలని సూచించారు.

ప్రస్తుతం రాష్ట్రానికి సంబంధించి టాప్ సర్వీసులు ఏవైనా ఉన్నాయంటే అది గ్రూప్ -1 కేడర్ మాత్రమే. ఈ కేడర్ ఉద్యోగులు ఎప్పటి నుంచో TAS కోసం డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలోనూ అత్యున్నతస్థాయి సర్వీస్ కేడర్ ఉండాలని కోరుతున్నారు. గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ ఈ డిమాండ్ ను ఎప్పటి నుంచో వినిపిస్తోంది. తమకు కూడా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లుగా (సీనియారిటీ ప్రకారం) పనిచేసే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. దీన్ని Conferred IAS Rank అంటారు. ఇప్పటిదాకా గ్రూప్ -1 అధికారుల్లో కేవలం రెవెన్యూ అధికారులు మాత్రమే Conferred IAS/IPS లుగా అవకాశం పొందుతున్నారు. అదే గ్రూప్ -1 స్థాయి ఉన్నప్పటికీ… కేవలం ఇతర శాఖల్లో పనిచేస్తున్నందుకు వారికి అవకాశం రావడం లేదు. అందువల్ల గ్రూప్ – 1 సర్వీసుల కోసం తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఏర్పాటు చేస్తే అందరికీ సమ న్యాయం జరుగుతుందనేది గ్రూప్ -1 ఆఫీసర్స్ అసోసియేషన్ వాదన.

తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (TAS) ఏర్పాటుపై ప్రతిపాదనలు తయారు చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులతో ఓ కమిటీని నియమించింది. కానీ ఆ ప్రతిపాదనపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడటంతో IAS ల కొరత ఏర్పడింది. కొత్తగా IASలు కావాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా ప్రయోజనం లేకపోయింది. చాలా శాఖల్లో IAS అధికారులు ఇంఛార్జులుగానే కొనసాగుతున్నారు. దాంతో పాలనా వ్యవస్థ ముందుకు సాగడం లేదని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో తొందర్లోనే తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ( TAS) ఏర్పాటు చేస్తే గ్రూప్ -1 ఆఫీసర్లకు ప్రమోషన్లతో పాటు అవసరమైతే కొత్త రిక్రూట్ మెంట్ చేపట్టడానికి కూడా అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.