మొన్నటి దాకా చంద్రబాబు చెబితే దేనికైనా సిద్ధం అన్నారు

బాబు కనుసైగలతో కతలు నడిపారు…

వాళ్ళ శరీరంలో రక్తం ఎరుపు కాదు… పసుపు అన్నట్టు ప్రవర్తించారు.

కానీ ఇప్పుడు… ఏపీలో చంద్రబాబు అధికారం కోల్పోవడంతో ఆ నాయకులంతా పార్టీ ఫిరాయిస్తున్నారు. వాళ్ళెవరో కాదు… చంద్రబాబు నాయుడికి నమ్మిన బంట్లు… సుజనా చౌదరి, సీఎం రమేష్… వీరితో పాటు గరికపాటి మోహన్ రావు, టీజీ వెంకటేష్. వీళ్ళంతా ఇప్పుడు కమలం పార్టీలోకి జంప్ చేస్తున్నారు.

టీడీపీకి రాజ్యసభలో మొత్తం ఆరుగురు ఎంపీలు ఉంటే… నలుగురు ఎంపీలు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ అద్యక్షుడు అమిత్ షాని కూడా కలిశారు. నలుగురు ఎంపీలకు తోడుగా కొందరు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా కమలం పార్టీలో చేరేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. అటు చంద్రబాబు ఇదే టైమ్ లో విదేశీ పర్యనటలో ఉన్నారు. దాంతో బాబు వచ్చే లోపు బీజేపీలోకి చేరేందుకు చక చక పావులు కదుపుతున్నారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలో లేదు. పైగా వైసీపీ 151 సీట్లతో భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. చావు తప్పి కన్నులొట్టబోయినట్టుంది టీడీపీ పరిస్థితి. ఇక కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాదని కలలు గన్న చంద్రబాబు… మమత బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ లాంటి నాయకుల్ని పట్టుకొని జాతీయ స్థాయిలో పెద్ద ఉద్యమం చేశారు. కాంగ్రెస్ ను తిరిగి అధికారంలోకి తేవాలని విశ్వప్రయత్నం చేశారు చంద్రబాబు. కానీ కథ అడ్డం తిరిగింది… ఏపీలో వైసీపీ, కేంద్రంలో బీజేపీ రాకుండా ఎంత గట్టి ప్రయత్నాలు చేస్తే.. అంత ఎక్కువ మెజార్టీతో రెండు పార్టీలో తిరుగులేకుండా ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. ఈపరిస్థితుల్లో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు… వైసీపీలో ఎలాగూ చేరలేని పరిస్థితి కాబట్టి… బీజేపీలో చేరడం అనేది వాళ్ళ ముందున్న ప్రత్యామ్నాయం.

అయితే చంద్రబాబుకి నమ్మిన బంట్లుగా ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్ పార్టీ మారడం అనేది మాత్రం విచిత్రంగా అనిపిస్తోంది. వీళ్ళిద్దరి మీదా పీకల్లోతు ఈడీ కేసులు ఉన్నాయి… సార్వత్రిక ఎన్నికల ముందు కూడా ఈ ఇద్దరి నేతల ఇళ్ళ మీదా ఈడీ దాడులు జరిగాయి. భారీగా అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో తమపై కక్ష సాధింపు వైఖరే అంటూ చంద్రబాబు సహా ఈ నేతలిద్దరూ బీజేపీపై నరేంద్రమోడీపై తీవ్ర విమర్శలు చేశారు. ఒకానొక దశలో మోడీని వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేశారు. అలాంటి నేతలకు ఇప్పుడు కాషాయ పార్టీపై ప్రేమ ఎందుకు వచ్చిందనేది అందరికీ తెలిసిందే. కేసులు మాఫీకేనంటూ విమర్శించే వారు కూడా లేకపోలేదు.

అటు బీజేపీ నేతలు మాత్రం ఎలాగైనా సరే ఆంద్రప్రదేశ్ లో తాము బలపడాలన్న ఉద్దేశ్యంతోనే టీడీపీ నేతలకు గాలం వేస్తున్నట్టు చెబుతున్నారు. ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు, మాజీలను కలుపుకుపోయి… వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో పాగా వేయాలన్నది బీజేపీ ప్లాన్ గా కనిపిస్తోంది.

నేతలు ఎవరు ఎటు వెళ్ళినా… తమ స్వార్థ్యమే తప్ప ప్రజా ప్రయోజనాలు కాదన్నది జనానికి తెలుసు.