ఈ మధ్య నలుగురు టీడీపీ ఎంపీలు బీజేపీలోకి జంప్ చేశారు. వాళ్ళల్లో ఇద్దరి మీద పీకల్లోతు ఆరోపణలు ఉన్నాయి. సుజనా చౌదరి, సీఎం రమేష్ పై ఈడీ, సీబీఐ, ఆర్థిక వ్యవహారాల శాఖ దాడులు చేశాయి.. సరిగ్గా 28 రోజుల క్రితం కూడా సుజనా చౌదరి ఇంటిపై ప్రభుత్వ వర్గాల దాడులు జరిగాయి…

దాంతో ఇకపై ఇలాంటి ప్రాబ్లెమ్స్ ఏవీ ఉండవ్. ఎందుకంటే వాళ్ళు బీజేపీ ఎంపీలు కాబట్టి. అయితే బీజేపీ నేతలు వీళ్ళు చేరకముందు ఒకలాగా… చేరిన తర్వాత మరోలాగా మాట్లాడుతుండటమే విచిత్రంగా అనిపిస్తుంది. సుజనా చౌదరి, సీఎం రమేష్ ను ఆంధ్రా మాల్యాలుగా అభివర్ణించారు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నర్సింహారావు. మరి అదే మాల్యాలు ఇప్పుడు బీజేపీకి ఎందుకు అవసరం వచ్చారు. ఎందుకంటే ప్రధాని నరేంద్రమోడీ రెండోసారి అధికారంలోకి వచ్చాక … పార్లమెంటు ఆమోదం పొందాల్సిన ఎన్నో కీలక బిల్లులు ఉన్నాయి. అందుకోసం పార్లమెంటులో సభ్యుల బలం కావాలి. లోక్ సభలో ఎలాగూ ఫుల్ మెజార్టీ ఉంది కాబట్టి ఢోకా లేదు. మరి రాజ్యసభలోనూ బీజేపీకి మెజార్టీ కావాలంటే మరో ఏడాది దాకా వెయిట్ చేయక తప్పదు. అప్పటి దాకా ఆగాలంటే అయ్యే పని కాదు… అందుకే ఈ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారనేది దేశమంతటా వినిపిస్తున్న టాక్. దీనికితోడు ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీని లేకుండా చేస్తే దక్షిణాదిలో బలం పెంచుకోవచ్చని చూస్తోంది కమలం పార్టీ. కమలం పార్టీ వ్యూహాలు ఎలా ఉన్నా… చంద్రబాబుకి నమ్మినబంట్లు బీజేపీకిలోకి వెళ్ళడమేంటనేది ప్రశ్న. అయితే చంద్రబాబే ఆ పార్టీలోకి పంపారన్న టాక్ కూడా నడుస్తోంది. మొదట్లో ఎన్డీఏతో జతకట్టిన బాబు… తర్వాత ఆ కూటమితో విభేదించాడు. ఆంధ్రప్రదేశ్ కు నిధులు రప్పించుకోకుండా… పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా గిల్లి కజ్జాలు పెట్టుకున్నారు. కేంద్రంతో వైరంతో చంద్రబాబుకి దక్కిందేమీ లేదు. బీజేపీ దృష్టిలో విలన్ మారడమే కాదు… రాష్ట్రంలో అధికారం కూడా లేకుండా పోయింది. అందుకే మరోసారి కమలనాధులతో దోస్తీకి బాబు సిద్ధమవుతున్నారన్న టాక్ నడుస్తోంది. అందుకే తన నమ్మిన బంట్లను ఆయనే స్వయంగా బీజేపీలోకి పంపారని అంటున్నారు.