ఏపీలో టీడీపీకి ఏపీ ప్రజలు గట్టి షాకిచ్చారు.  ప్రతిపక్ష హోదా కూడా రాదా… అన్నంత పని చేశారు.  ఐదేళ్ళ పాలనలో ఎంతో అభివృద్ధి చేశాను… నావల్లే ఏపీకి మంచి రోజులు… కేంద్రంలో కూడా నేనే చక్రం తిప్పుతా… అంటూ బీరాలు పలికిన చంద్రబుని ప్రజలు తిరస్కరించారు.

2014లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడికి ఉన్న రాజకీయ, పాలనా అనుభవాన్ని ఏపీ ప్రజలు గుర్తించారు.  తెలంగాణతో విడిపోయి ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పథంలో నిలబెడతారని అంతా ఆశించారు.  అందుకే టీడీపీకి జనం అధికారాన్ని కట్టబెట్టారు.  కానీ ఐదేళ్ళ తర్వాత  గానీ తెలియలేదు… చంద్రబాబుది ప్రచార ఆర్భాటమే తప్ప … కొంచెమైనా అభివృద్ధి కనిపించలేదు.

రాష్ట్ర అభివృద్ధి కోసమంటూ విదేశీ పర్యటనలు చేసిన చంద్రబాబు… అమరావతిలో చెప్పుకోడానికి ఏ ఒక్క భవనాన్నీ నిర్మించలేకపోయారు.  కన్సెల్టెన్సీలు, తాత్కాలిక భవనాలు, విదేశాల్లో స్టడీ పేర్లతో కోట్ల రూపాయలు వృధా చేశారు.  విదేశాల నుంచి వేలు, లక్షల కోట్ల రూపాయలు వస్తున్నట్టు ప్రకటనలూ, ప్రచారం చేసుకున్నారు. కానీ  చెప్పుకోదగ్గ భారీ పరిశ్రమ ఏదీ రాలేదు.  పట్టుమని పదిమందికి ఉద్యోగం కూడా రాలేదు.  రాజధాని నిర్మాణంలో చంద్రబాబు వైఫల్యం స్పష్టంగా కనిపించింది.

పదేళ్ళుగా ఉన్న హైదరాబాద్ రాజధానిని అమరావతికి మార్చిన బాబు … ఉద్యోగులకు అక్కడ కనీస సౌకర్యాలు కల్పించలేకపోయారు.  ఉద్యోగులు కోరిన ఫించన్ పథకాన్ని అమలు చేయలేకపోయారు. పైగా హైదరాబాద్ లో కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఉన్న  రీయింబర్స్ మెంట్ పథకాన్ని కూడా ఎత్తేశారు.  దాంతో చాలామంది ఉద్యోగులు తమకు, తమ కుటుంబ సభ్యులకు వైద్యం చేయించుకునే అవకాశం లేక ఇబ్బందులు పడ్డారు.

ప్రచారాలతోనే పాలన సాగించిన చంద్రబాబుకి  ప్రభుత్వ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలు కోలుకోలేని దెబ్బ తీశాయి.  మంత్రులు అవినీతి ఊబిలో కూరుకుపోతున్నా… చంద్రబాబు సమర్థించుకు రావడాన్ని జనం సహించలేకపోయారు.  క్షేత్ర స్థాయిలో తమ్ముళ్ళు కూడా తలనొప్పులు తెచ్చిపెట్టారు. గ్రామాల్లో జన్మభూమి కమిటీలు చేసిన అరాచకం అంతా ఇంతా కాదు… ప్రతి విషయంలో ఈ కమిటీల పెద్దలదే పెత్తనం అన్నట్టు సాగింది. దాంతో పల్లె జనంలో టీడీపీ అంటే విసుగెత్తిపోయారు. ఇటు  మంత్రులు, ఎమ్మెల్యే ఓవర్ యాక్షన్ … అధికారులపై జులుం ప్రదర్శించడం  లాంటివి జనం గ్రహించారు.

ఇక 2014 లో వెనుకా ముందు చూడకుండా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు… వాటిని నిలబెట్టుకోలేకపోయారు.  చివరి ఆరు నెలల్లో జనాన్ని తనవైపు తిప్పుకోడానికి ఓట్ల కొనుగోలు ప్లాన్ చేశారు. నిరుద్యోగ భృతి అమలు, పసుపు కుంకుమ కింద మహిళలకు డబ్బులు, ఫించన్ల పెంపు, రైతులకు పెట్టుబడి పథకం… ఇలా ప్రభుత్వ పథకాల పేరుతో తెగ డబ్బులు కుమ్మరించారు.  అయినా నాలుగున్నరేళ్ళల్లో లేని ప్రేమ… చివరి నిమిషంలో గుర్తుకొచ్చిందా… అని ప్రతిపక్ష నేతలు ప్రశ్నించారు.  చంద్రబాబు మోసాన్ని గ్రహించాలంటూ జనంలోకి బలంగా తీసుకెళ్లారు.

పవన్ కల్యాణ్ తో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చాలన్న చంద్రబాబు నాయుడి ప్రయత్నాలు కూడా ఫలించలేదు.  నోట్ల రద్దును పొగిడారు… ప్రత్యేక హోదాకంటే ప్యాకేజీ బెటర్ అన్నారు… బీజేపీని మెచ్చుకొని తర్వాత ఒక్కోటి యూటర్న్ తీసుకుంటూ వచ్చారు.  మోడీ, జగన్ పై విమర్శలే తప్ప… పాలనలో తన మార్క్ ప్రదర్శించడంలో విఫలం అవడం వల్లే జనం తెలుగుదేశం పార్టీని తిరస్కరించారు. రాష్ట్రంలోనే కాదు, జాతీయ స్థాయిలో కూడా ముఖం చూపించుకోలేని పరిస్థితి చంద్రబాబుకి వచ్చింది.

పైగా ఎల్లో మీడియా కూడా చంద్రబాబును ఆకాశానికి ఎత్తేసింది.  అంతకంటే ముఖ్యంగా జగన్ పై దాడి జరిగినప్పుడు… కోడి కత్తి జగన్ అంటూ …. ప్రతిపక్ష నేతను చంద్రబాబు సహా టీడీపీ నేతలు అవమానించడం… అందుకు ఎల్లో మీడియా వంత పాడటాన్ని జనం సహించలేకపోయారు.