మహర్షి సినిమాకి టిక్కెట్ల రేట్లు పెంచారు

మహేష్ బాబు హీరో నటించిన మహర్షి సినిమా కోసం థియేటర్ల యాజమాన్యాలు ఏకపక్షంగా టిక్కెట్ల రేట్లు పెంచుకున్నాయి. ముగ్గురు బడా నిర్మాతలు ఈ మహర్షి సినిమాని నిర్మిస్తున్నారు. వేసవి సెలవుల్లో ఈ సినిమా వస్తుండటం, కలెక్షన్స్ బాగా వచ్చే అవకాశం ఉండటంతో భారీ లాభాలు పొందాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వ అనుమతి లేకుండానే టిక్కెట్ల రేట్లు పెంచుకున్నారు.

సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.80లు గతంలో ఉండగా, దాన్ని రూ.110 కి పెంచారు. అలాగే మల్టీఫ్లెక్స్ థియేటర్లలో రూ.138 ఉండాల్సిన టిక్కెట్టు ధర రూ.200వరకూ పెరిగింది. ఇవి కాకుండా ఇంటర్నెట్ లో లేదా యాప్స్ లో బుక్ చేసుకుంటే అదనపు బాదుడు తప్పడం లేదు. గతంలో కొత్త సినిమాకి వారం రోజుల దాకా ఇష్టమొచ్చిన టిక్కెట్ల రేట్లు నిర్ణయించుకునే అవకాశం థియేటర్లకు ఉండేది. కానీ తెలంగాణ ప్రభుత్వం అలాంటి విధానానికి స్వస్తి చెప్పింది. అయినా ప్రభుత్వ అనుమతి లేకుండానే మహర్షి సినిమా కోసం ఇష్టమొచ్చినట్టు టిక్కెట్ల రేట్లు పెంచుకోవడం పై ప్రేక్షకులు మండిపడుతున్నారు.

సినిమా టిక్కెట్ల రేట్ల పెంపునకు అనుమతి లేదు: మంత్రి తలసాని

తెలంగాణలో సినిమా టిక్కెట్ల ధరలు పెంచలేదని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ అనుమతితో సింగిల్ స్క్రీన్ థియేటర్లు, మల్టీఫ్లెక్సులు టిక్కెట్ల రేట్లు పెంచుకున్నట్టు ప్రచారం చేయడాన్ని ఖండించారు. ఈమధ్యకాలంలో రేట్ల పెంపు కోసం ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదనీ… అనవసరం ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయొద్దన్నారు మంత్రి. మరి ఇప్పుడు ప్రభుత్వం పేరు చెప్పి దర్జాగా జనాన్ని దోచుకుంటున్న థియేటర్ యాజమాన్యాలపై అధికారులు దాడులు చేస్తారా ? లేదా అన్నది చూడాలి.

మొత్తానికి మహేష్ బాబు గతంలో తన AMV థియేటర్ లో ప్రేక్షకుల నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేసి ఆ తర్వాత అధికారుల దాడులతో ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ మహేశ్ బాబు సినిమాపైనే ఇలాంటి ఆరోపణలు రావడంపై ప్రేక్షకులు మండిపడుతున్నారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాల ధనాశ మహేశ్ బాబుకి కూడా చెడ్డపేరు తెస్తోందని అంటున్నారు.