రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభంజనంలా దూసుకొచ్చిన కారుకు బ్రేకులు పడుతున్నాయి. రాష్ట్రంలో ఆ పార్టీ ప్రభ ఇప్పుడిప్పుడే మసకబారుతోంది. అధ్యక్షుడు కేసీఆర్ చేస్తున్న తప్పులే ఇందుకు కారణం అంటున్నారు టీఆర్ఎస్ అభిమానులు.  తెలంగాణ రాష్ట్రాన్ని తేవడంలో కీలక పార్టీగా టీఆర్ఎస్ కి మంచి గుర్తింపు ఉంది. చాలా మందిలో ఆ అభిమానం చెక్కు చెదరలేదు. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ కు క్రమంగా దూరమవుతున్నారు.

హరీష్ ను ఎందుకు పక్కనబెట్టారు ?

కేసీఆర్ కి ఉద్యమ కాలం నుంచి వెన్నంటి ఉన్నాడు. కారు డ్రైవర్, అసిస్టెంట్ గా కూడా పనిచేశాడు. కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. అధినేతకు సైనికుడిగా వ్యవహరించాడు. అయినా సరే … కేటీఆర్ కి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కట్టబెట్టారు కేసీఆర్. అంతేకాదు… తనకు ఇచ్చిన శాఖను ఎంతో సమర్థవంతంగా నిర్వహించిన హరీష్ కు కనీసం మంత్రి వర్గంలో కూడా చోటివ్వలేదు. అసలు హరీష్ రావుకి ప్రత్యామ్నాయం ఉంటుందని ఎలా భ్రమపడ్డారని ప్రశ్నిస్తున్నారు అభిమానులు. హరీష్ ని పక్కనబెట్టడం అనేది జనంలో ఎంత నెగిటివ్ గా పోయిందో టీఆర్ఎస్ అధ్యక్షుడు గ్రహించాలంటున్నారు.

ఎమ్మెల్యేల ఫిరాయింపులు అవసరమా ?

88 సీట్లు గెలుచుకొని క్లియర్ మెజార్టీ ఉన్న టీఆర్ఎస్ మరో 10-12 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పార్టీలోకి ఆకర్షించడం అవసరమా అని టీఆర్ఎస్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. 2014లో కొంత మెజార్టీ తక్కువగా ఉండటంతో అప్పట్లో ఫిరాయింపులకు ఓకే అనుకున్నా… ఇప్పుడు కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు… ఇలా టీఆర్ఎస్ లో చేరిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు వాళ్ళ నియోజకవర్గాల్లో ముఖం చూపించుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. వాళ్ళపై వ్యతిరేకత కూడా వస్తోంది.

మంత్రులు, ఎమ్మెల్యేలకు దూరమవుతున్న కేసీఆర్

2014లో అధికారం చేపట్టినప్పటి నుంచి గులాబీ బాస్ క్రమంగా మంత్రులు, ఎమ్మెల్యేలకు దూరమవుతున్నారు. అంతకుముందు ఆప్యాయంగా పలకరించే బాస్… ఇప్పుడు కేవలం మీటింగ్ ల సమయంలోనే కలుస్తున్నారని అంటున్నారు. మిగతా రోజుల్లో కేసీఆర్ ని కలవడం కష్టంగా ఉందని సొంత పార్టీ నేతలే వాపోతున్నారు.  ఇటీవల పార్టీ నుంచి బయటకు వచ్చిన వివేక్ లాంటి సీనియర్లు కూడా ఇదే మాట చెబుతున్నారు.

కేటీఆర్ చుట్టూ కోటరీ

వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టూ కోటరీ తయారైందన్న విమర్శలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఆయన మంత్రిగా ఉన్నప్పుడే చుట్టూ చేరిన ఈ భజనపరులు… వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక ఇంకా చెలరేగిపోతున్నారట. సోషల్ మీడియాలో దీనిపై రోజూ విమర్శలు వస్తున్నా… కేటీఆర్ లైట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. కనీసం గ్రౌండ్ లెవల్లో ఏం జరుగుతోందో తెలుసుకోలేకపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

లోక్ సభ సభ్యుల ఎంపికలో తప్పిదాలు

లోక్ సభ సభ్యుల ఎంపికలో పార్టీ చేసిన తప్పిదాలపై విమర్శలు వస్తున్నాయి. అప్పటికప్పుడే టీఆర్ఎస్ లో చేరిన నామా, వెంకటేష్ లాంటి వాళ్ళు ప్రస్తుతానికి గెలిచినా అసలు వాళ్ళని ఎందుకు పార్టీలో చేర్చుకున్నారని ప్రశ్నిస్తున్నారు. ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఏమైంది… పెద్దపల్లిలో వివేక్ ను ఎందుకు పక్కనబెట్టారు… నిన్న మొన్నటిదాకా టీఆర్ఎస్, కేసీఆర్ ను తిట్టిన వాళ్ళనే పార్టీలో ఎందుకు చేర్చుకున్నారని ప్రశ్నిస్తున్నారు.

అలాగే కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, సీతారాం నాయక్ ఏం పాపం చేశారని అడుతున్నారు టీఆర్ఎస్ అభిమానులు. ఇక సికింద్రాబాద్ లో తలసాని రవికిరణ్ యాదవ్ కి టిక్కెట్టు ఇవ్వడాన్ని టీఆర్ఎస్ అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నో ఆరోపణులు ఉన్న ఆ వ్యక్తికి ఎందుకు టిక్కెట్ ఇచ్చారని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
చేసిన తప్పులు సరిదిద్దుకోలేకపోతే టీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రావడం కష్టమేనని అంటున్నారు.