మొన్నటి దాకా నరేంద్రమోడీ సర్కారుకు దగ్గరగా మెలిగిన గులాబీ బాస్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు దూరమవుతున్నట్టు కనిపిస్తోంది. రాష్ట్రంలో 16 ఎంపీలను గెలిపిస్తే కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ వస్తుందనీ… అక్కడ చక్రం తిప్పొచ్చని భావించారు కేసీఆర్. అందుకోసం గత పార్లమెంటు ఎన్నికల టైమ్ లో మోడీతోపాటు బీజేపీపైనా మస్తుగా విమర్శలు చేశారు సీఎం కేసీఆర్. కానీ డామిట్ కథ అడ్డం తిరిగింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చాక… రాష్ట్రంలో టీఆర్ఎస్ కి మెజారిటీ తగ్గింది. బీజేపీ సొంతంగా పుంజుకుంది. దాంతో రాష్ట్రంలో ఫలితాలు గులాబీ బాస్ కు మింగుడుపడనవిగా తయారయ్యాయి. అటు కేంద్రంలో కూడా NDA ప్రభుత్వానికి గతంలో కంటే తిరుగులేని మెజారిటీ వచ్చింది. దాంతో కేసీఆర్ కి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి.

అంతేకాదు… రాష్ట్రంలో నాలుగు స్థానాలు గెలుచుకోవడంతో మంచి బూస్టింగ్ లో ఉన్న కమలనాధులు పార్టీని స్ట్రాంగ్ చేసే పనిలో పడ్డారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా పటిష్టం చేసి… జిల్లాల్లో వివిధ పార్టీల్లో ఉన్న ప్రముఖ నేతలను కూడా పార్టీలో చేర్చుకుంటున్నారు. అందుకోసం బీజేపీ సీనియర్ నేత రాం మాధవ్ స్వయంగా రంగంలోకి దిగారు. అటు రాష్ట్ర నాయకత్వం కూడా టీఆర్ఎస్ పై మాటల దాడి ప్రారంభించింది. మరోవైపు- కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కారులోకి జంప్ చేయడంతో ఆ పార్టీ పరిస్థితి కుదేలైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్తు, ఆ పార్టీ ఎదుగుదలపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా తయారైంది. అందుకే బీజేపీ ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. అటు కేంద్రం నుంచి నేరుగా నిధులను తీసుకొచ్చి రాష్ట్రంలో పట్టు సంపాదించాలని కమలనాధులు స్కెచ్ వేస్తున్నారు.

అందుకే బీజేపీతో ఇకపై అంటీ ముట్టనట్టుగా వ్యవహరించాలని గులాబీ నేతలు డిసైడ్ అయినట్టున్నారు. ఒకానొక దశలో కాళేశ్వరం పనులకు పీఎం నరేంద్ర మోడీని ఆహ్వానించడం లేదన్న వార్తలు కూడా వచ్చాయి. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనూ కేవలం రాష్ట్ర ప్రయోజనాలపైనే నజర్ పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే తమ పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. ఇటు టీఆర్ఎస్ లో సెకండరీ కేడర్ కూడా బీజేపీపై మాటల యుద్ధం పెంచింది.

ఏది ఏమైనా రాబోయే రోజుల్లో మాత్రం తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా వాతావరణం కనిపిస్తోంది.