ఎండాకాలం సెలవులు ముగిసి బడుల్లోకి వచ్చిన పిల్లలకు… అవే శిథిలావస్థ భవనాలు స్వాగతం పలికాయి… పెచ్చులూడినవి, పడిపోడానికి సిద్ధంగా ఉన్న గోడలు… టాయిలెట్స్ లేవు… తాగడానికి మంచి నీళ్ళు లేవు… అన్నీ సమస్యలే. గతంలో కొన్ని స్కూళ్ళకు కొత్త భవనాలు మంజూరు చేసింది ప్రభుత్వం. అయితే కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో పాటు ఐదేళ్ళుగా నిర్మాణం జరుగుతున్న పాఠశాలలు ఎన్నో ఉన్నాయి. కనీసం ఈ ఏడాది కూడా అవి అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదు.

ఇవే కాకుండా రెండేళ్ళ క్రితం రాష్ట్రంలో ఉపాధ్యాయుల భర్తీ కోసం TSPSC ద్వారా TRT నోటిఫికేషన్ ఇచ్చారు. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ద్వారా కొందరిని క్వాలిఫై చేశారు. కానీ ఏం ప్రయోజనం… వాళ్ళని ఇప్పటిదాకా నియమించలేదు. దాంతో పిల్లలు స్కూలుకు వెళితే టీచర్ ఉంటాడో… లేదో తెలియని పరిస్థితి రాష్ట్రంలోని చాలా సర్కారీ బడుల్లో ఉంది. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి మెదక్ తో పాటు చాలా జిల్లాల్లో ఉపాధ్యాయుల కొరతతో విద్యా వాలంటీర్లను నియమించింది ప్రభుత్వం. ఈ ఏడాది కూడా వాళ్ళనే కంటిన్యూ చేసే పరిస్థితి కనిపిస్తోంది.

తెలంగాణలో విద్యావిధానంపై విమర్శలు

మొన్న ఇంటర్మీడియట్ దగ్గర నుంచి ఇప్పుడు స్కూళ్ళ దుస్థితి దాకా… తెలంగాణలో విద్యా వ్యవస్థ పరిస్థితి అయోమంగా ఉంది.  ఇంటర్ బోర్డు వైఫల్యాలకి పాతిక మందికి పైగా విద్యార్థులు చనిపోయినా… వేల మంది విద్యార్థులు మానసిక క్షోభను అనుభవించినా సర్కారుకి  పట్టలేదు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యావేత్తలు, రాజకీయ నాయకులు గగ్గోలు పెట్టడంతో ఎట్టకేలకు సీఎం కేసీఆర్  మీటింగ్ పెట్టారు. గుడ్డిలో మెల్లగా రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ లో డబ్బులను మినహాయించారు. చివరకు హైకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

ఇంత చేసినా… ఇంటర్మీడియట్ బోర్డు నుంచి తప్పుల మీద తప్పులు బయటపడుతూనే ఉన్నాయి… అయినా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నట్టుగా ప్రభుత్వం ఇప్పటిదాకా ఇంటర్ బోర్డు సెక్రటరీ అశోక్ సహా ఏ ఒక్క అధికారిపైనా యాక్షన్ తీసుకోలేదు.

ఓవైపు ఇంటర్ బోర్డు సమస్యలు..

మరోవైపు స్కూల్ సమస్యలు

ఇంకోవైపు ఉపాధ్యాయుల నియామక సమస్యలు…

ఇలా విద్యావ్యవస్థలో రోజు రోజుకీ ఎన్నో లోపాలు బయటపడుతున్నాయి. తెలంగాణ సర్కార్ ఎప్పుడు చర్యలు మొదలుపెడుతుందో చూడాలి.