దేశంలో నిరుద్యోగం పెరిగింది !

భారత్ లో నిరుద్యోగ రేటు గత ఏప్రిల్ నాటికి 7.6శాతానికి చేరుకుంది. 2016 అక్టోబర్ నుంచి 2019 మార్చి వరకూ 6.71శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు ఏప్రిల్ లో బాగా పెరిగినట్టు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ చెబుతోంది. దీనికి సంబంధించిన డేటాను బుధవారం రిలీజ్ చేసింది.

ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఈ టైమ్ లో నిరుద్యోగ రేటు పెరగడం అనేది ప్రధాని నరేంద్రమోడీకి ఇబ్బందిగా మారనుంది. ఈనెల 19వ తేదీతో సార్వత్రిక ఎన్నికలు ముగుస్తాయి. దాంతో ప్రతిపక్షాలు నిరుద్యోగ రేటు తమ ఎన్నికల ప్రచార అస్త్రంగా చేసుకునే అవకాశముంది.  ఏప్రిల్ నెలలో ఎన్నికలు మొదలవడంతో ఫ్యాక్టరీల కార్యకలాపాలు తగ్గిపోయాయి. దీనికితోడు తయారీ పరిశ్రమల్లో (Manufacturing industries) లో ప్రస్తుతం స్థబ్దత కొనసాగుతోంది. మే చివరి నాటికి కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం ఎలాంటి కొత్త విధానాలను తీసుకొస్తుందో అన్న టెన్షన్ తో ఉన్నాయి ఇండస్ట్రీ వర్గాలు.

గత డిసెంబర్ లో నిరుద్యోగ రేటు డేటా బయటకు వచ్చింది. న్యూస్ పేపర్లలో లీక్ అవడంతో పెద్ద దుమారం చెలరేగింది. దాంతో వెంటనే మోడీ ప్రభుత్వం ఆ డేటాని నిలిపేసింది. అధికారికంగా మరోసారి వెరిఫై చేయాల్సి ఉంటుందని చెప్పింది.  2017-18కి వెలువడిన ఈ నిరుద్యోగ రేటు అంచనాలు గడచిన 45యేళ్ళల్లో హైయ్యస్ట్ గా నమోదు అయ్యాయి. సాధారణంగా దేశంలో నిరుద్యోగ రేటును ప్రతి ఐదేళ్ళకోసారి అధికారికంగా ప్రకటిస్తారు. ఇకపై ఏడాదికోసారి వెల్లడించాలని ప్రభుత్వం నిర్ణయించింది.