పశ్చిమ బెంగాల్ లోని తృణమూల్ కాంగ్రెస్ సర్కార్ పై రాష్ట్రపతి పాలన కత్తి వేలాడుతున్నట్టు కనిపిస్తోంది. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ – తృణమూల్ మధ్య ఉప్పు – నిప్పూలా వైరం కొనసాగింది. ఆ రాష్ట్రంలో రెండు పార్టీల కార్యకర్తల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ ఎన్నికల తగదాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. పదుల సంఖ్యలో రెండు పార్టీల కార్యకర్తలు హత్యకు గురవుతున్నారు. ఈ క్రమంలో తృణమూల్ కంటే బీజేపీకే ఎక్కువ నష్టం జరుగుతోంది. తమ కార్యకర్తల హత్యకు నిరసనగా 12 గంటల బంద్ కూడా పాటించింది. దాంతో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయన్న వాదన చేస్తోంది బీజేపీ.

బెంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠీ కూడా శాంతి భద్రతలు క్షీణిస్తే రాష్ట్రపతి పాలనే శరణ్యమన్న వాదన వినిపిస్తున్నారు. ఆయన ఇప్పటికే ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు కూడా. రాష్ట్రంలో తలెత్తిన హింసాత్మక ఘటనలపై నివేదిక ఇచ్చారు. ప్రస్తుతం కేంద్రంలో NDA కి ఫుల్ మెజారిటీ ఉంది. దాంతో బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించాలన్న ఆలోచన బీజేపీ పెద్దల్లో కనిపిస్తోంది.

అటు తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ మాత్రం రాష్ట్రంలో హింసకు బీజేపీయే కారణమంటోంది. ప్రతిపక్షాల పాలనలో ఉన్న ప్రభుత్వాలను పడగొట్టి అధికారం దక్కించుకోవాలని చూస్తోందంటూ ఎన్డీఏ సర్కార్ పై మండిపడుతున్నారు. ప్రస్తుత పరిణామాలు చూస్తే మాత్రం పశ్చిమబెంగాల్ లో రాష్ట్రపతి పాలన దిశగా అడుగులు పడుతున్నట్టు కనిపిస్తోంది.