దేవాలయాల్లో దేవుడి చిత్రాలు, వారి సేవలో తరించిన బంట్లు, ఇతర ముఖ్యమైన దేవతా మూర్తుల చిత్రాలను చెక్కడం అనేది మనం అనాది నుంచి చూస్తున్న సంప్రదాయం. కానీ టీఆర్ఎస్ సర్కార్ లో సీన్ మారింది. పవిత్ర యాదాద్రి ఆలయంలో కేసీఆర్ ముఖచిత్రం, టీఆర్ఎస్ ఎన్నికల గుర్తుతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పథకాలైన హరితహారం, కేసీఆర్ కిట్ బొమ్మలను చెక్కారు.

యాదాద్రి ప్రధాన ఆలయం చుట్టూ కృష్ణ శిలతో నిర్మిస్తున్న అష్టభుజి ప్రాకారం స్థంభాలపై ఈ చిత్రాలను చెక్కారు. వీటిల్లో చార్మినార్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాన్ని కూడా చెక్కారు శిల్పులు.
రాజుల కాలంలో కూడా ఏ రాజూ దేవాలయాలపై తమ చిత్రాలను చెక్కించుకోలేదు. ఆఖరికి అద్భుతమైన శిల్పకళా సంపదను తెలంగాణ ప్రాంతానికి అందించిన కాకతీయులు కూడా తమ చిత్రాలను ఏ గుడిపైనా చర్చించిన దాఖలాల్లేవు. అయితే మరి కేసీఆర్ చిత్రాలు చెక్కాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది… ఎవరికి వచ్చింది… అనేది అర్థం కాని ప్రశ్న. ప్రతిపక్ష నేతలు మాత్రం ముఖ్యమంత్రి కేసీఆరే ఈ చిత్రాలను చెక్కమని ఆదేశాలిచ్చారని చెబుతున్నారు. వెంటనే కేసీఆర్ తో పాటు మిగతా చిత్రాలను యాదాద్రి స్థంభాల నుంచి తొలగించాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. కేసీఆర్ నియంతృత్వ పోకడకు నిదర్శనమని మండిపడుతున్నాయి.
అయితే ఈ వ్యవహారంలో కొసమెరుపు ఏమంటే… కేసీఆర్, ప్రభుత్వ పథకాలు, టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారుతో పాటు… ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, మహాత్మా గాంధీ చిత్రాలను కూడా ఆలయ స్థంభాలపై చెక్కారు.

దేవాలయాలపై రాజకీయ చిత్రాలను పొలిటికల్ లీడర్స్, హిందూ సంస్థలే కాదు… సామాన్య భక్తులు కూడా ఎవరూ ఒప్పుకోరు. ప్రశాంతంగా ఉండాల్సిన పవిత్ర దేవాలయాలకి కూడా ఇలా రాజకీయ రంగు పులమడం అనేది భారత దేశ చరిత్రలోనే మొదటిసారి తెలంగాణలో జరిగిందని అనుకోవచ్చేమో.