యోగి, మాయావతిపై ఎన్నికల కమిషన్ నిషేధం

ఉత్తరప్రదేశ ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యా నాథ్, మాయావతిపై ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. కోడ్ ఉల్లంఘనల కింద యోగి ఆదిత్యనాథ్ పై 72 గంటలు, మాయావతిపై 48 గంటల పాటు నిషేధం విధించింది. ఈ ఇద్దరు నేతలు తమ ఎన్నికల ప్రసంగాల్లో చేసిన కామెంట్స్ కోడ్ ఉల్లంఘించేవిగా ఉన్నాయి. అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఇద్దరు నేతలకు కేవలం నోటీసులు ఇచ్చి సరిపెట్టుకుంది. ఈమధ్య కాలంలో చాలామంది రాజకీయ నేతలు తమ ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ చేస్తున్నా… ఈసీ కేవలం నోటీసులతోనే సరిపెడుతోంది. దాంతో ఈ విషయమై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. దాంతో ఆగ్రహించిన సుప్రీంకోర్టు ఈసీకి నోటీసులు ఇచ్చింది. నాయకులపై చర్యలు తీసుకోడానికి ఈసీకి ఎలాంటి అధికారాలు లేకపోవడం లేదా వాటిని ఉపయోగించుకోకపోవడంపై సుప్రీంకోర్టు మండిపడింది. దాంతో దిగొచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం ఆదిత్యానాథ్, మాయావతిపై నిషేధం అస్త్రం విధించింది.
భారత సైన్యాన్ని మోడీ సేనగా ఇటీవల ఎన్నికల ప్రచారంలో అభివర్ణించారు యోగీ ఆదిత్యనాథ్. అలాగే బీజేపీకి ముస్లింలు ఓట్లు వేయొద్దని మాయావతి తన ఎన్నికల ప్రచారంలో పిలుపునిచ్చారు. ఈ రెండు సంఘటనలతో వీళ్ళిద్దరిపైనా నిషేధం విధించింది ఈసీ.

యోగీ ఆధిత్యనాథ్ 72 గంటల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదు. ర్యాలీలు, సభలు, సమావేశాలతో పాటు ప్రెస్ మీట్స్ కూడా నిర్వహించకూడదు. అలాగే మాయావతి కూడా ఈసీ ఆదేశాలతో 48 గంటలపాటు ఎలాంటి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీల్లేదు.