1000 కోట్లు కొట్టేశారు !

1000 కోట్లు కొట్టేశారు !

అద్భుతమైన టెక్నాలజీని వాడుకున్నారు. బ్యాంకులను బురిడీ కొట్టించారు. కేవలం అనుభవం, తెలివితేటలను పెట్టుబడిగా పెట్టుకొని ఏకంగా వెయ్యికోట్ల రూపాయలు కొట్టేశారు. ఈమధ్య సైబరాబాద్ పోలీసులకు దొరికిన సైబర్ క్రైమ్ ముఠా నాలుగేళ్ళల్లో 1000 కోట్ల దాకా కొట్టేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ ముఠాకు నాయకత్వం వహించింది నవీన్ భుటాని. ఇతను గతంలో బ్యాంకింగ్ రంగంలో ఆర్థిక లావాదేవీలు, క్రెడిట్ కార్డులపై పనిచేసిన అనుభవాన్ని ఇలా ఫ్రాడ్ కి ఉపయోగించుకున్నాడు.

విదేశీ కార్డులే టార్గెట్

ఆస్ట్రేలియా, సింగపూర్, యూకేల్లో ఉపయోగించే క్రెడిట్ కార్డులకు భారత్ లోని బ్యాంకులు ఫ్రాంచైజ్ గా ఉంటున్నాయి. ఈ కార్డులతో ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోళ్లు, చెల్లింపులు జరిపే ఖాతాదారులను వీళ్ళు టార్గెట్ గా పెట్టుకున్నారు. కస్టమర్లు చేసే కొనుగోళ్లు, నగదు చెల్లింపులకు కార్డు నంబరు, CVV, Expiry Date ఉంటే సరిపోతుంది. మన దేశంలో లాగా OTP తో పనిలేదు. సరిగ్గా ఈ ఛాన్సును తమకు అనుకూలంగా మార్చుకొని దోపిడీ మొదలుపెట్టారు. టోల్‌ఫ్రీ నంబర్లు, ఐపీ చిరునామాలు విదేశాల్లో ఉన్నట్టుగా ట్యాంపరింగ్‌ చేశారు. ఈ అంతర్జాతీయ క్రెడిట్‌కార్డుల సొమ్ము కాజేసిన ముఠాకు దుబాయ్‌కు చెందిన ముగ్గురు నిందితులు కూడా సాయం చేశారు. పేమెంట్‌ గేట్‌వేల ద్వారా కాజేసిన క్యాష్ ను విదేశాలకు పంపేవాళ్ళు. టోల్ ఫ్రీ నెంబర్లు మార్చి మార్చి కోట్ల రూపాయలు కొట్టేశారు. ఫస్ట్ టైమ్ వాడిన టోల్‌ఫ్రీ నంబరుతో దాదాపు లక్ష మందిని, రెండో టోల్‌ఫ్రీ నంబరుతో 33 వేల మంది నుంచి కోట్లల్లో కాజేశారు. ప్రస్తుతం సైబర్‌ పోలీసులు విదేశాల్లోని క్రెడిట్‌కార్డు కస్టమర్ల సమాచారం సేకరిస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుంటే మరిన్ని వివరాలు రాబట్టవచ్చని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *