కోవిడ్ టీకా తర్వాత జ్వరం ఎందుకు వస్తుంది ?

కోవిడ్ టీకా తర్వాత జ్వరం ఎందుకు వస్తుంది ?

కరోనా టీకా తీసుకున్న తర్వాత కొంతమందికి జ్వరం, తీవ్రమైన తలనొప్పి, అలసట, ఆయాసం లాంటి లక్షణాలు కనిపించాయి. దీంతో వ్యాక్సిన్‌ వేసుకుంటే కరోనా వస్తుందేమోనన్న అపోహలో ఉన్నారు చాలామంది. అయితే టీకా తర్వాత  ఇలాంటి లక్షణాలు రావడం అనేది సాధారణమంటున్నారు డాక్టర్లు. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ పునరుత్తేజమవుతుందనీ… అందుకే ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయంటున్నారు డాక్టర్లు.

రోగ నిరోధక వ్యవస్థలో రెండు భాగాలుంటాయి. ఒకటి.. సహజమైనది. రెండోది.. సముపార్జిత వ్యవస్థ. మన ఒంట్లోకి ఏదైనా ప్రవేశించిందని శరీరం గుర్తించిన వెంటనే ఈ సహజ వ్యవస్థ స్పందించి ప్రతి చర్య మొదలుపెడుతుంది. కరోనా టీకా వేసుకోగానే.. తెల్ల రక్తకణాలు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని ప్రక్రియ ప్రారంభిస్తాయి. దాని వల్లే టీకా వేసుకున్న భాగంలో తిమ్మిర్లు, నొప్పిగా అనిపించడం, అలసటగా ఉండటం లాంటి లక్షణాలు కన్పిస్తాయి.

మన రోగ నిరోధక వ్యవస్థలోని ఈ రాపిడ్‌ రెస్పాన్స్‌ ప్రక్రియ వయసును బట్టి క్షీణిస్తుంది. యువతలో ఈ ప్రతిస్పందన ఎక్కువగా ఉంటే.. వృద్ధుల్లో తక్కువగా ఉండొచ్చు. అందుకే వృద్ధుల కంటే యువతలోనే టీకా తీసుకున్న తర్వాత జ్వరం, తలనొప్పి లాంటి లక్షణాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. శరీర తత్వాన్ని బట్టి ఒక్కొక్కరిలో ఒక్కో విధమైన లక్షణాలు కన్పిస్తున్నాయంటున్నారు డాక్టర్లు.  టీకా రెండు డోసులు తీసుకున్నా కొందరిలో జ్వరం, తలనొప్పి, అలసట లాంటి లక్షణాలు రాకపోవచ్చు. దాంతో వ్యాక్సిన్‌ పనిచేయట్లేదని అనుకోవద్దంటున్నారు. టీకాలు మన రోగ నిరోధక వ్యవస్థలోని రెండో భాగమైన సముపార్జిత వ్యవస్థను చైతన్యవంతం చేస్తాయి. టి, బి కణాలు, యాంటీబాడీలు ఇందులోనే ఉంటాయి.  అసలైన ప్రక్రియ అప్పుడే మొదలవుతుంది. ఈ వ్యవస్థ పునరుత్తేజమై శరీరంలో యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. ఇవే వైరస్‌ నుంచి మనకు రక్షణ కల్పిస్తాయంటున్నారు వైద్య నిపుణులు..

ఒక్కోసారి టీకా వల్ల శోషరస గ్రంథుల్లో వాపు కన్పిస్తుంది. అయితే ఇవి క్యాన్సర్‌ గడ్డలని భయపడుతుంటారు. అందుకే టీకా తీసుకునేందుకు మహిళలు మామోగ్రామ్స్‌ చేయించుకోవాలని  డాక్టర్లు సూచిస్తున్నారు.  చాలా తక్కువ మందిలో మాత్రమే టీకా తీసుకున్నా అలర్జీ వచ్చే అవకాశాలు ఉన్నట్టు చెబుతున్నారు. టీకా వల్ల ఎలాంటి లక్షణాలు కల్పించినా అవి గంటలు లేదా కొన్ని రోజులు మాత్రమే ఉంటాయంటున్నారు డాక్టర్లు.  ఇలాంటి లక్షణాలు ఎక్కువ రోజులు  కన్పిస్తే మాత్రం వెంటనే డాక్టర్లను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. అపోహలు మనసులో పెట్టుకొని… వ్యాక్సిన్‌ వేసుకోవడం మానొద్దని సూచిస్తున్నారు. ఈ చిన్న చిన్న లక్షణాల గురించి భయపడితే… కరోనా వైరస్ నుంచి బయటపడలేరని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: