ఐదో రోజు అన్నపూర్ణాదేవి అలంకరణ

ఐదో రోజు అన్నపూర్ణాదేవి అలంకరణ

ఐదో రోజు అన్నపూర్ణాదేవి అలంకరణ

ఇంద్రకీలాద్రిపై దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఐదో రోజైన ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారు..అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. సకల జీవరాశికి ఆహారం ప్రసాదించే అన్నపూర్ణ దేవి అలంకారాన్ని చూసేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు.

అమ్మవారి రూపం: ఓ చేతిలో అక్షయపాత్ర, మరో చేతిలో గరిట పట్టుకుని ప్రజల ఆకలి దప్పులను తీర్చే తల్లిగా అన్నపూర్ణ దేవి రూపం భక్తుల్లో పారవశ్యాన్ని నింపుతున్నారు అమ్మవారు.

పూజా విధానం: అన్నపూర్ణాదేవిని తెల్లని పుష్పాలతో పూజించాలి.

చీర: గంధం చీర లేదా పసుపు రంగు చీరను అమ్మవారికి ఒడికి చేర్చవచ్చు

అమ్మవారిని ఎలా జపించాలి: “హ్రీం శ్రీం క్లీం ఓం నమో భాగవత్యన్నపూర్ణేశ మమాభిలాషిత మహిదేవ్యన్నం స్వాహా”  అనే మంత్రాన్ని జపించాలి.

అన్నపూర్ణ అష్టోత్తరం, స్తోత్రాలు పారాయణం చేయాలి.

అమ్మవారికి నైవేద్యం: దధ్ధోజనం, పొంగలి, కొబ్బరి అన్నం, పులిహార, చక్రపొంగలి నివేదించాలి.

“ఉర్వీ సర్వజయేశ్వరీ జయకరీ మాతాకృపాసాగరీ

నారీనీల సమానకుంతల ధరీ నిత్యాన్నదానేశ్వరీ

సాక్షాత్ మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ”

కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ ఆలయం కథ: కాశీలో కాశీ లేదా వారణాసి అంటే అందరికీ గుర్తొచ్చే విషయాలు పవిత్ర గంగా నది, కాశీ విశ్వనాధుడు. వీటితో పాటు అతి ముఖ్యమైన మరో ప్రదేశం కూడా ఇక్కడ ఉంది. అదే కాశీ అన్నపూర్ణ ఆలయం. ఇక్కడి ప్రజలు ఎప్పుడూ ఆకలితో అలమటించరు. అందరికీ అన్నం పెట్టే అమ్మగా అన్నపూర్ణను భక్తులు కొలుస్తారు. పరమశివుని సతీమణి పార్వతీ దేవి అన్నపూర్ణ రూపంలో ఇక్కడ పూజలందుకుంటున్నారు. ఈ భూమిపై మానవులు బ్రతకడానికి తిండి, నీరు ఎంత ముఖ్యమైనవో అందరికీ తెలిసిందే. కాశీలో అందరి దాహాన్ని గంగమ్మ తీరిస్తే , ఆకలిని అన్నపూర్ణమ్మ తీరుస్తుంది. ప్రజలకు ఇక్కడ ఎప్పుడూ సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది. కాశీ విశ్వనాథ్ ఆలయానికి సమీపంలో విశ్వనాథ్ గలీలోని దశశ్వమేధ్ రోడ్డులో అన్నపూర్ణ ఆలయం ఉంది.

​అన్నపూర్ణా దేవి కథ: కాశీ అన్నపూర్ణ దేవికి సంబంధించి ప్రముఖంగా ఒక కథ ప్రచారంలో ఉంది. పవిత్ర హిందూ గ్రంధాలు, పురాణాల ప్రకారం…ఓ సారి పరమశివుడు ప్రపంచంలో అన్నంతో సహా అన్నీ మాయే అని అంటాడు. భక్తుల ఆకలిని తీర్చే అమ్మ అయిన పార్వతీ దేవికి శివుని మాటలు నచ్చక కాశీ విడిచి కనిపించకుండా వెళ్లిపోతుంది. దాంతో ఆహారం దొరకక ప్రజలు అలమటించడం ప్రారంభవుతుంది. ప్రజల కష్టాలను చూడలేని అమ్మవారు తిరిగి వచ్చి అందరి ఆకలిని తీరుస్తుంది. చివరికి ఆహారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన శివుడు తన మాటలను వెనక్కి తీసుకుని భిక్ష పాత్రను పట్టుకుని పార్వతీ దేవి వద్దకు వెళ్లి ఆహారాన్ని అడిగినట్లు చెబుతారు. అప్పటి నుండి పార్వతీ దేవి అన్నపూర్ణగా కాశీలో నేటికీ భక్తుల ఆకలిని తీరుస్తూనే ఉందని నమ్ముతారు.

కాశీలో ​అన్నకూట్ ఉత్సవం: ఈ ఆలయంలో అన్నపూర్ణ దేవి యొక్క బంగారు విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహాన్ని దీపావళి తరువాత మరుసటి రోజు వచ్చే అన్నకూట్ పండుగలో సంవత్సరానికి ఒకసారి భక్తుల దర్శనం కోసం ఉంచుతారు. ఇతర రోజులలో అన్నపూర్ణ ఆలయ గర్భగుడిలో అమ్మవారి విగ్రహం ఇత్తడి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తుంది కథల్లో చెప్పబడ్డాయి.

ప్రతి ఏడాది ఈ ఆలయంలో నిర్వహించే అన్నకూట్ ఉత్సవాన్ని వీక్షించేందుకు అనేక ప్రాంతాల నుండి భక్తులు వస్తుంటారు. వారికి ఇక్కడ ప్రత్యేక నాణేలను కూడా పంపిణీ చేస్తారు. కాశీలో ప్రజలు ఎవరూ ఆకలితో ఉండకుండా అన్నపూర్ణ దేవి చూసుకుంటుందని భక్తుల విశ్వాసం.

కాశీ విశ్వనాథ్ ​ఆలయ సందర్శన: భక్తులు కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని దర్శించుకున్న తరువాత అన్నపూర్ణ ఆలయానికి వెళతారు. వారు ఆలయ వంటశాల నిర్వహణకు గానూ తగిన వస్తువులను విరాళంగా ఇవ్వడంతో పాటు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించే ఉచిత అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక్కడ వంటగది, భోజన శాల ఎంతో ఘనంగా నిర్వహించబడతాయి. స్వచ్ఛంధ సేవకులు భక్తులను ఆహారాన్ని పంపిణీ చేస్తారు.

అమ్మవారిని ​ఎప్పుడు దర్శించాలి: దీపావళి మరియు అన్నకూట్ పండుగ సమయాల్లో వారణాసిలోని అన్నపూర్ణ దేవి ఆలయ సందర్శన ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు. మీరు రద్దీ లేకుండా దర్శనం చేసుకోవాలంటే నవంబర్ నెలాఖరులో లేదా డిసెంబర్ లో కాశీ ప్రయాణం బయల్దేరడం మంచిది.

ఇతర ప్రాంతాల నుండి వచ్చే యాత్రికుల కోసం అన్నపూర్ణ ఆలయం వద్ద దగ్గరలో ఉండే ఉచిత వసతితో పాటుగా అద్దె గదులు అందుబాటులో ఉంటాయి. అయితే సందర్శకులు ముందుగానే ధర్మశాల వద్ద గదులను ముందుగానే తనిఖీ చేసుకోవాల్సి ఉంటుంది.

శ్రీ అన్నపూర్ణా అష్టోత్తర శతనామావళి చదువుకొని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: