“గోమాత”ను ఎందుకు పూజించాలి..?

“గోమాత”ను ఎందుకు పూజించాలి..?
భారతదేశంలో పురాణాల్లో గోమాతను సకల దేవతల స్వరూపంగా వర్ణించడం జరిగింది. గోమాతను ఎంతో దైవంగా భావిస్తుంటారు. ఆనాడు అమృతం కోసం దేవతలు, రాక్షసులు ఆదిశేషువు తాడుగా మంధర పర్వతాన్ని కర్రగా చేసుకుని క్షీర సాగరాన్ని మథిస్తారు. అయితే ఆ క్షీర సాగర మథనంలో కామధేనువు కూడా మథనం నుంచి ఉద్భవిస్తుంది. ఈ ఆవునే సురభి అని కూడా పిలుస్తారు.
లోకంలో ఉన్న పశుసంపదలన్నిటికీ ఈ కామధేనువే ఆధారం అని పురాణాలు చెప్తాయి. కామధేనువు ఇంద్రుడి దగ్గర ఉంటుంది. మరికొన్ని పురాణగాథల్లో వశిష్ఠుడి ఇంటిలో, కొన్ని పురాణగాథల్లో గౌతమ ముని వద్ద ఉన్నట్లు తెలిపారు. కామధేనువు వశిష్టుని తపస్సు కోసం కావలసినవన్నీ ప్రసాదించింది. కామధేనువు పుత్రిక శబల అనే గోవు, కామధేనువు పుత్రుడు నంది. ఏ పురాణంలో అయినా కామధేనువు మాత్రం, ఏది కోరినా దాన్ని తక్షణమే ప్రసాదించే మహిమ గలది.
గో మహిమ గురించి శివపార్వతులు ఏమన్నారంటే:
“ శ్రీ కృష్ణ పరమాత్మ” గోవును ఎంతో భక్తితో శ్రద్ధతో సేవకుడిగా చూసుకొనే వాడు. మహా జనులారా గోవును పూజించిన ముక్తికి పొందెదరు. ఓకానొకప్పుడు పార్వతీదేవి కైలాసమున పరమశివుని భక్తితో పూజించి, నాథా ! స్త్రీలు తెలిసి తెలియక ముట్లు, అంటు కలిపిన దోషం, పెద్దలను, బ్రాహ్మణులను, భక్తులను దూషించిన దోషం, పరులను హింసించిన దోషం, పరులను హింసించిన పాపం ఏ విధముగా పరిహారమగునో చెప్పవలసినదిగా ప్రార్థింపగా దయామయుడగు పరమశివుడు ” ఓ పార్వతీ! గోవునందు సమస్త దేవతలు కలరు. అట్టి గోవును పూజించిన సర్వపాపములు నశించును.
ఆ గోవునందు పాదములు ఋణ పితృ దేవతలు, గొలుసులు, తులసి దళములు, కాళ్ళ లో సమస్త పర్వతాలు, మారుతీ కూడా కలరు. నోరు లోకేశ్వరం, నాలుక నాలుగు వేదములు, భ్రూమధ్యంబున గంధర్వులు, దంతాన గణపతి, ముక్కున శివుడు, ముఖమున జ్యేష్ఠాదేవి, కళ్ళలో సూర్య చంద్రులు, చెవులలో శంఖు-చక్రాలు, కొమ్ములలో యమ, ఇంద్రులు ఉన్నారు. కంఠమున విష్ణువు, భుజమున సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, మూపురమున బ్రహ్మదేవుడు, గంగడోలున కాశీ, ప్రయాగ నదులు ఉండును. ఉదరమున పృధ్వీ దేవి, వెన్నున భరద్వాజ, కుబేర, వరుణ, అగ్ని మొదలగు దేవతలు ఉన్నారు.
ఉదరమున సనక, సనంద, సనత్ కుమారులు, తోకన చంద్రుడు, తోక కుచ్చున సూర్య కిరణములను, తోలు ప్రజాపతి, రోమావళి త్రిశంత్కోటి దేవతలు పిరుదుల యందు పితరులు, కర్రి కావేరిబోలు, పాదుగు పుండరీకాక్షుని బోలు, స్తనాలు,సప్త సముద్రాలు, పాలు సరస్వతి నది, పెరుగు నర్మదా నది, నెయ్యి అగ్ని, బొడ్డున శ్రీకమలం, అమృతం కడుపులో ధరణీ దేవతలు, గోపచింత గంగ, యమున, ప్రయాగ, త్రివేణి నదులు తీర్థం, గోమయంలో శ్రీ మహాలక్ష్మి కలదు. గోపాద ధూళి సమస్త పుణ్య నదులు, తీర్థములు కన్నా గొప్పది.
కావున ఓ పార్వతీ ! ఈ గోమాహాత్మ్య వర్ణనను ఉదయం పఠిస్తే బ్రహ్మ హత్యా మహా పాతకములన్నియు తొలగును. ప్రతి అమావాస్యనాడు పఠిస్తే మూడు నెలల మహాపాపములు తొలగును. నిత్యము సంధ్య వేళ పఠించిన మహాలక్ష్మి అనుగ్రహము కలుగును. గోవును ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో వారి మూడు తరాల పితృదేవతలు తరించెదరు. గోవుకు తృప్తిగా మేత, సెనగలు, బెల్లం తినిపించిన సమస్త దేవతలు తృప్తి పడెదరు. గోవుకు మనసారా నమస్కరించిన మంచి ఫలితము నిచ్చును. గోవుకు ఐదు సార్లు ప్రదక్షిణం చేసిన భూ ప్రదక్షిణంతో సమానం. గోవును పూజించితే సమస్త దేవుళ్ళను పూజించి నట్లగును. గోమాతను దర్శించి గో ప్రదక్షిణం చేయవలెను.
ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గోపూజ చేసినవారు సమస్త పాపముల నుండి విముక్తి పొంది విష్ణు సాన్నిధ్యమును పొందుతారు. కార్తీక బహుళ ద్వాదశిని గోవత్స ద్వాదశి అంటారు. ఈ రోజున గోపూజ చేసిన వారు అనంతకోటి పుణ్యములు పొంది 41 రోజులు చేసిన పుణ్యఫలము ఈ ఒక్క రోజు చేసినచో పుణ్యం లభిస్తుంది” అని బోధించాడు.
అయితే మహాభారతంలో వశిష్ట మహర్షి తలపెట్టిన భూయాగం పట్ల దేవేంద్రేడు అసహనానికి లోనవుతాడు. ఆ ప్రాంతంలో కరవు కాటకాలను సృష్టిస్తాడు. ఆశ్రమంలోని శిష్యులంతా ఆకలితో బాధలు పడుతుంటారు. అరుందతి బిడ్డల ఆకలి తీర్చే శక్తిని ప్రసాదించమని పార్వతీదేవీ అమ్మవారిని కోరుతుంది. అమ్మవారు అరుంధతికి గోమాతను ఇస్తూ కామధేనువు మహిమ ఆ తల్లి సెలవిస్తుంది. అరుంధతి ఆశ్రమంలోని అందరి ఆకలిని తీరుస్తుంది
రామాయణంలో రుషి కశ్యపుడు, అతని భార్య క్రోధవశల కుమార్తె సురభి. ఆమెకు మళ్లీ ఇద్దరు కూతుళ్లు జన్మిస్తారు. వారు రోహిణి, గోదావరి. ఈ క్రమంలో సురభి కోరిన కోర్కెలు తీర్చే మధేనువుగా మారిందని పురాణాలు చెబుతున్నాయి.
ఇంద్రుడు వశిష్ట మహర్షి యొక్క యజ్ఞాలకు మెచ్చి పుత్రిక అయిన శభల అనే గోవుని ఇస్తాడు. ఇది కామధేనువు లాగే తన యజమానికి ఏది కోరితే అది ఇవ్వగలదు.
దేవీ భాగవతము చెబుతున్న దాని ప్రకారమైతే శ్రీకృష్ణుడే స్వయంగా సురభి ఆవును బృందావనంలో సృష్టించాడట … గోపికలతో బృందావనంలో నాట్యమాడుతుండగా అకస్మాత్తుగా కృష్ణునికి తీవ్రమైన దాహం వేస్తుందట. దీంతో శ్రీకృష్ణుడు అప్పటికప్పుడే సురభిని సృష్టించి దాని పాలను తాగుతాడట.
ఆవులను గోమాతగా వర్ణించడానికి పురాణాలలో కొన్ని కథలు కూడా వున్నాయి. ఇటువంటి ఎన్నో స్వరూపం కలిగిన గోమాతను పూజించడం వల్ల సర్వపాపాలు సంహరించిపోతాయని పురాతనకాలం నుంచే ప్రతి ఒక్కరు ప్రగాఢంగా విశ్వసిస్తూ వస్తున్నారు.
గోవును పూజించే విధానం: ముందుగా గోవును శుభ్రంగా కడిగి దాని తలభాగంలో కుంకుమ, పసుపు, పూలుతో పూజిస్తారు. గోవుకు పండ్లు, ఉలవులతో సహా పలురకాల తృణ ధాన్యాలు గోవుకు నైవేద్యంగా సమర్పిస్తారు. గోవు చుట్టూ తిరిగి వెనభాగంలో కూడా పూజిస్తారు
గోవులో ఏఏ దేవతలుంటారు:
గోవు పాదాలలో ఋణ పితృదేవతలు, గొలుసులలో తులసి దళములు, కాళ్లలో సమస్త పర్వతాలు, మారుతీ తదితరులు కలవారున్నారు. అలాగే గోమాత నోరు లోకేశ్వరం, నాలుక 4 వేదాలుగానూ, భ్రూమద్యంబున గంధర్వులు, దంతాలలో గణపతి, ముక్కులో శివుడు, ముఖంలో జ్యేష్ఠాదేవి, కళ్లలో సూర్యచంద్రులవారు, చెవులలో శంఖు-చక్రాలు, కొమ్ములలో యమ – ఇంద్రులు వున్నారు. అలాగే కంఠంలో విష్ణువు, భుజాన సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, మూపురంలో బ్రహ్మదేవుడు, గంగడోలున కాశీ – ప్రయాగ నదులు మొదలైనవి వుంటాయి. ఇలాగే గోమాతలో వున్న రకరకాల అవయవాల్లో సకల దేవతలు కొలువై వున్నారు. అందువల్లే పురాణాల్లో గోమాతకు ప్రత్యేక స్థానాన్ని పొందుపరిచారు. పూజ పునస్కారాలలోని వీటి ప్రాశస్త్యం తెలియని వారుండరు. అలాగే ఆవు పేడతో పూజా స్థలంలో అలికి ముగ్గు పెట్టి పూజా కార్యక్రమం మొదలెడతారు.
సకల దోష నివారణకు ఆవు పంచితాన్ని ఇంటా బయట చల్లు తారు. ఇది హిందువుల ఆచారం. అందుకే ప్రొద్దున్నే లేవగాను గోవును చూస్తే సకల దోషాలు పోతాయని శాస్త్రాలలో చెప్బబడుతుంది.