విజయ దశమి రోజు జమ్మి చెట్టుకే ఎందుకు పూజ చేయాలి..?
విజయ దశమి రోజు జమ్మి చెట్టుకే ఎందుకు పూజ చేయాలి..?
నవరాత్రుల్లో చివరిరోజును విజయదశమి(దసరా) రోజున జమ్మిచెట్టును పూజించడం మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం. అయితే మన హిందువులు చెట్లను పూజించడంలో ఎంతో ప్రాముఖ్యతనిస్తారు.
ఈ విజయ దశమి రోజున శమీ వృక్షానికి పూజ చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. జమ్మి చెట్టుకు మనసులో అనుకున్న కోరికలను ఓ కాగితం మీద రాసి చెట్టుకు కట్టి అమ్మవారిని మనసులో ధ్యానించుకోవడం వల్ల మనం అనుకున్న కోరికలు నెరవేరతాయట. ఇది ఇతిహాసాల్లో తెలిపారు. అయితే ఈ జెమ్మి చెట్టు ఆకులను ఎవరైనా పెద్దలకు పంచడం మన సంప్రదాయం. వారి నుంచి ఆశీర్వాదం తీసుకోవడం ఎన్నో ఏండ్లుగా ఆనవాయితీగా వస్తూనే ఉంది. ఇలా దసరా రోజునే జమ్మి ఆకులను జమ్మి చెట్టును ఎందుకు పూజిస్తారు? ఎందుకనీ కానీ దీని వెనుక పురాణ గాథలు ఎన్నో ఉన్నాయి.. శమీ పూజ చేయడం వల్లే వచ్చే లాభాలేంటి…? జమ్మి చెట్టుకు ఉన్న ప్రత్యేకత ఏంటో ఓ సారి తెలుసుకుందామా మరీ..?
జమ్మి గురుంచి పురాణాలు ఏం చెబుతున్నాయి?
రుగ్వేద కాలం నుంచి జమ్మి ప్రస్తావన ఉంది. జమ్మి చెట్టును సంస్కృతంలో శమీ వృక్షం అని పిలుస్తారు. అయితే మన పురాణాలలో జమ్మికో పేరు ఉందట.. దాని పేరు అరణి అని అంటారు.
త్రేతా యుగంలో లంకకు వెళ్లే ముందు శ్రీ రాముడు శమీ పూజ చేసి వెళ్లాడంట. అందుకే రావణుడి మీద విజయం సాధించాడని రామాయణ గాథ చెప్తోంది. అలాగే మహా భారతంలో పాండవులు అజ్ఞాత వాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను ఒక మూటలో కట్టి శమీ వృక్షంపై ఉంచారు. తమ అజ్ఞాత వాసం పూర్తయ్యే వరకు తమ ఆయుధాలను జాగ్రత్తగా కాపాడమని శమీ వృక్షాన్ని కోరి నమస్కరించి వెళ్లారంట. అజ్ఞాత వాసం పూర్తయిన తర్వాత జమ్మి చెట్టు వద్దకు వచ్చిన పాండవులు శమీ వృక్షానికి పూజ చేసి తమ ఆయుధాలను తీసుకున్నారు. అనంతరం కౌరవులతో యుద్ధంలో పాల్గొని వారిని ఓడించారు. అప్పట్నుంచి విజయ దశమి రోజున శమీ వృక్షాన్ని పూజిస్తే అపజయం ఉండదని ఒక నమ్మకంగా మారింది. దసరా రోజు సాయంత్రం సమయంలో జమ్మి చెట్టు వద్ద అపరాజితా దేవిని పూజిస్తారట. ఆ తల్లి ప్రత్యక్షమయ్యేందుకే.. ఈ శ్లోకాన్ని పఠిస్తారని శాస్త్రాలలో చెప్పబడ్డాయి.
శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశినీ
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియ దర్శనం
.. అని శ్లోకం చదివి జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ చెట్టు ఆకులను తెంచుకొని ఇంట్లోని పెద్దలకు ఇచ్చి నమస్కరించి వారి ఆశ్వీర్వాదం తీసుకొంటారట. జమ్మిని పూజించడం అంటే జీవితంలో సకల విజయాలు సాధించాలని అందరూ కోరుకుంటారు.
అయితే జమ్మి చెట్టు గురించి మన ఇతిహాసాల్లో ఇంకో విధంగా కూడా ఉంది. అమృతం కోసం దేవ దానవులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు దేవతా వృక్షాలు ఉద్భవించాయట. అందులో శమీ వృక్షం కూడా ఒకటి. అప్పట్లో ఈ చెట్టును అగ్నిని పుట్టించే సాధనంగా ఉపయోగించేవారు. అందుకే దీన్ని “అరణి” అని కూడా పిలుస్తారు. కావున మన భారత దేశంలో పల్లెటూర్లలోని రైతులు సహా కట్టేలుకొట్టే వాడి దగ్గర నుంచి పెద్దలందరికీ శమీ వృక్షం అంటే తెలియవారు ఉండరు.