సాగర్ లో పీఓపీ విగ్రహాలకు నో, ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ఎక్కడ…!

సాగర్ లో పీఓపీ విగ్రహాలకు అనుమతి లేదు, ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ఎక్కడ…!
సాగర్ లో పీఓపీ విగ్రహాలకు నో ఛాన్స్
నిమజ్జనం ప్రత్యామ్నాయాలపై జీహెచ్ఎంసీ దృష్టి
పీఓపీ విగ్రహాల కోసం బేబీ పాండ్స్
గ్రేటర్ పరిధిలో 25 మినీ కొలనులు
హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనం విషయంపై సర్వత్ర ఉత్కంట నెలకొంది. ఈ నేపథ్యంలో హుస్సేన్‌సాగర్‌తో పాటు ఇతర చెరువుల్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్(పీఓపీ) విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని కోర్టు స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వ విభాగాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించాయి. నిమజ్జన ఏర్పాట్ల కోసం హైదరాబాద్ లోని వివిధ ప్రదేశాలను పరిశీలిస్తున్న జీహెచ్ఎంసీ, గణేష్ నిమజ్జనం కోసం బేబీ పాండ్స్ (మినీ నిమజ్జన కొలనులు)ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. అయితే ప్రతి ఏటా సాగర్ లోనే ఖైరతాబాద్ మహాగణపతిని నిమజ్జనం చేస్తారు. అయితే ఈసారి ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనంపై సందిగ్ధత ఏర్పడింది.
హైదరాబాద్ లో గతంలో నిర్మించిన కొలనులను బతుకమ్మ ఘాట్లుగా కూడా వినియోగిస్తున్నారు. జీహెచ్ఎంసీ నివేదిక ప్రకారం గ్రేటర్లో 25 బేబీ పాండ్స్ ఉన్నాయని తెలిపింది. ఈ వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు ఈ కొలనులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సిద్ధం చేస్తున్నారు అధికారులు. పీపుల్స్ ప్లాజా దగ్గర మట్టి గణపతుల నిమజ్జనం కోసం క్రేన్లు ఏర్పాటు చేశారు. సిటీలో గణేష్ విగ్రహాలు ఇంచుమించు ఒకే పరిణామంతో ఉన్నాయని తెలిపారు. గ్రేటర్ పరిధిలో ఆదివారం నుంచే పలు కొలనుల్లో నిమజ్జనం మొదలైంది. ఖైరతాబాద్ పరిధిలో గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు ప్రస్తుతం 8 నుంచి 10 అడుగుల మేర నీళ్లు నింపి నిమజ్జనం చేస్తున్నామని..తెల్లవారి ఆ విగ్రహాలను తొలగిస్తున్నామని తెలిపారు.
గ్రేటర్ లో ఎక్కడికక్కడే నిమజ్జనం..
గ్రేటర్లో విగ్రహాల నిమజ్జనం ఏర్పాట్లపై పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. మహా నిమజ్జనం వచ్చే ఆదివారం జరగనుంది. ప్రతి ఏటా సాగర్ లో నిమజ్జనానికి వేలాదిగా విగ్రహాలు తరలి వస్తుంటాయి. అయితే ఈసారి పీఓపీ విగ్రహాలను ఎక్కడ నిమజ్జనం చేయాలన్నదానిపై సందిగ్ధత ఏర్పడింది. అందుకే ఈసారి అన్ని విగ్రహాలు నిమజ్జనం చేసిన పక్షంలో కొలనుల వద్ద ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. సిటీలోని ఆయా విగ్రహాల కమిటీలను ఒప్పించి విగ్రహాలను తొందరగా నిమజ్జనం అయ్యేలా చూస్తున్నామని తెలిపారు. ఆయా ప్రదేశాల్లో ఉన్న మండపాల కమిటీకి.. ఎక్కడ నిమజ్జనం చేయాలనేదానిపై పాసులు జారీ చేస్తున్నామన్నపోలీసులు.
ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం ఎక్కడ
ఖైరతాబాద్ గణపతి ఈ యేడాది 40 అడుగుల ఎత్తులో విగ్రహం ప్రతిష్టించారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఖైరతాబాద్ గణపతి నిమజ్జనంపై చర్చ జరుగుతోంది. ఈసారి ఖైరతాబాద్ గణేష్ డిని హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేసే అవకాశాలు లేనట్లే కనిపిస్తున్నాయి. అయితే ఖైరాతాబాద్ మహా గణపతిని జల విహార్ సమీపంలోని బేబీ పాండ్‌లో నిమజ్జనం చేసే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. పీవీ ఘాట్ సమీపంలోని కొలనులో నిమజ్జనం చేసే అవకాశం ఉందని కొందరు అధికారులు చెబుతున్నారు. బాలాపూర్, ఇతర ప్రాంతాల్లోని పెద్ద విగ్రహాల నిమజ్జనానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు. హైకోర్టు తీర్పుతో ఈసారి నిమజ్జన ఏర్పాట్లపై అధికారులు తర్జనభజ్జన పడుతున్నారు.