శ్రీవారి దర్శనాలను వాయిదా వేసుకోండి: టీటీడీ ఛైర్మన్

శ్రీవారి దర్శనాలను వాయిదా వేసుకోండి: టీటీడీ ఛైర్మన్

తిరుమల ఘాట్ రోడ్డులో బుధవారం ఉదయం కొండచరియలు విరిగిపడటంతో భక్తులెవ్వరూ రావొద్దని టీటీడీ కీలక ప్రకటన చేసింది. దీంతో భక్తులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అయితే తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు తమ ప్రయాణాలను వారం రోజుల పాటు వాయిదా వేసుకోవాలని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఈ దర్శనం టిక్కెట్లను రీ షెడ్యూల్ చేసుకునే వెసులుబాటును త్వరలోనే కల్పిస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు. దర్శనం టికెట్లు ఉన్నవారు వచ్చే ఆరు నెలల్లో ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చని సూచించారు.

బుధవారం తిరుమల ఘాట్ రోడ్డులోని కొండచరియలు విరిగి పడిన ప్రాంతాన్ని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. 20 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా భారీ వర్షాలు కురవడంతో తిరుమల ఘాట్‌రోడ్డులో భారీ స్థాయిలో కొండచరియలు విరిగిపడుతున్నాయని టీటీడీ ఛైర్మన్ తెలిపారు. తిరుమల ఘాట్ రోడ్డులోని నాలుగు ప్రాంతాల్లో పూర్తిగా రోడ్లు దెబ్బతినడంతో రహదారులు బాగుచేస్తున్నామని.. దీని కోసం ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి ఐఐటీ నిపుణులను పిలిపిస్తున్నామని టీటీడీ ఛైర్మన్ తెలిపారు. వర్షాలు తగ్గుముఖం పడితే.. ఘాట్ రోడ్డులోని రహదారుల పునరుద్ధరణకు మరో వారం రోజుల సమయం పడుతుందన్నారు. అందువల్ల భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం వాయిదా వేసుకుంటే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: