ద‌స‌రా రోజునే పాలపిట్ట‌ను ఎందుకు చూడాలి..?

ద‌స‌రా రోజునే పాలపిట్ట‌ను ఎందుకు చూడాలి?

భారతదేశమంతటా దసరా పండుగ విశిష్టత గురించి మనందరికీ తెలిసిందే. ఈ దసరానే విజయదశమి అని కూడా అంటారు. రావణ దహనంతో పాటుగా పాలపిట్టను దర్శించుకోవడం ఎన్నో ఏండ్లుగా అనవాయితీగా వస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో దసరాని జరుపుకుంటూంటారు. ద‌స‌రా రోజు పాలపిట్ట‌క‌నిపిస్తే శుభ‌సూచికంగా భావిస్తారు. అందుకే శ‌మీ పూజ అనంత‌రం పాల పిట్ట‌ను చూసేందుకు ప్ర‌జ‌లు ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే పుణ్యం కట్టుకోవాలన్న ఆతృతతో ప్ర‌త్యేకించి ఊరి చివ‌ర‌కు, పొలాల మ‌ధ్య‌కు వెళ్లి మ‌రి పాలపిట్ట‌ క‌నిపిస్తుందేమోన‌ని ఎదురుచూస్తుంటారు.

విజయదశమి రోజున ఈ పాలపిట్టను చూడటం ద్వారా ఎంతో అదృష్టంగా, శుభ సూచికంగా ప్రజలు భావిస్తారు. దీన్ని ఆరోజు చూడటం వల్ల అంతా శుభమే జరుగుతుందని, చేపట్టిన ప్రతీ పని విజయవంతం అవుతుందని.. భక్తుల విశ్వాసం.

పాండ‌వులు అర‌ణ్య‌, అజ్ఞాత వాసాల‌ను ముగించుకుని తిరుగు ప్ర‌యాణ‌మై త‌మ రాజ్యానికి వెళ్తున్న స‌మ‌యంలో వారికి పాలపిట్ట‌ ద‌ర్శ‌న‌మిచ్చింది. అప్ప‌టి నుంచి వారి క‌ష్టాలు తొల‌గిపోయాయి. కురుక్షేత్ర సంగ్రామంలో విజ‌యం సాధించ‌డంతో పాటు పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి పొందారాట. అందుకే ద‌స‌రా రోజు పాల‌పిట్ట‌ను చూస్తే శుభాలు క‌లుగుతాయ‌ని ప్ర‌జ‌ల విశ్వాసం. అప్పటి నుంచే విజయ దశమి రోజున పాలపిట్టను చూస్తారు.

అయితే పాల పిట్ట ఉత్త‌ర దిక్కు నుంచి ఎదురైతే శుభాలు క‌లుగుతాయని.. దీంతో పాటుగా ఈ పాల పిట్ట ద‌క్షిణం దిక్కు నుంచి వ‌స్తే అశుభానికి సంకేత‌మ‌ని కూడా ప్రచారంలో ఉంది.

మన హిందూ పురాణాలు, సాంస్కృతిక ఇతిహాసాల్లో పాలపిట్ట‌కు ఎంతో ప్రాధాన్యం ఉంది. కాబట్టే.. దీన్ని మ‌న రాష్ట్ర ప‌క్షిగా గుర్తించాం. ఈ పాల పిట్ట గుర్తింపు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ మరియు క‌ర్ణాట‌క‌, ఒడిశా, బిహార్ రాష్ట్రాల అధికార ప‌క్షి కూడా పాలపిట్ట‌నే గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *