తెలంగాణ రాష్ట్రంలో కొలువుల లొల్లి

తెలంగాణ రాష్ట్రంలో కొలువుల లొల్లి

ఎన్నడూ లేనివిధంగా తెలంగాణలో ఇప్పుడు కొలువుల లొల్లి నడుస్తోంది. మేం 1,32,899 పోస్టులు ఇచ్చామని మంత్రి కేటీఆర్ సవాల్ చేస్తుంటే… అటు కాంగ్రెస్, బీజేపీ, టీజెఎస్ తో పాటు OU నిరుద్యోగ జేఏసీ అందరూ కౌంటర్స్ ఇస్తున్నారు. గతంలో ఈ కొలువుల సంగతి ఎవరూ పట్టించుకోలేదు. అప్పుడప్పుడూ ప్రతిపక్షాలు ప్రస్తావించినా… ఇప్పుడు గ్రాడ్యుయేట్ MLC ఎన్నికలు జరుగుతుండటంతో కొలువుల సంగతి అధికార పార్టీతో పాటు అన్ని పార్టీల లీడర్లకు గుర్తుకొస్తున్నాయి. 2014 నుంచి 2020 వరకూ 1లక్షా 32 వేల 899 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్టు కేటీఆర్ బహిరంగ లేఖ ఒకటి రిలీజ్ చేశారు.
అయితే కేటీఆర్ చెప్పిన లెక్కల్లో చాలా మటుకు కాంట్రాక్ట్ బేసిస్ వాళ్ళని రెగ్యులర్ చేసినవే ఉన్నట్టు ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు. విద్యుత్ సంస్థల్లో పోస్టులు ఇచ్చినట్టు చెబుతున్నారు. అయితే ఇప్పటికే పనిచేస్తున్న వారిని పర్మినెంట్ చేశారని అంటున్నా… అసలు ఇంకా తమను రెగ్యులర్ చేయలేదని విద్యుత్ శాఖ ఉద్యోగులు మొత్తుకుంటున్నారు. మంత్రి కేటీఆర్ కు AICC అధికార ప్రతినిధి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. మంత్రి లెక్కలను తీసుకొని గన్ పార్క్ కు చర్చకు రావాలని సవాల్ చేశారు. కానీ మంత్రి కాదు కదా… ఆయన తరపున ఎవరూ చర్చకు రాలేదు. పైగా మంత్రి తలసాని గొట్టంగాళ్ళు పిలిస్తే రావాలా… అంటూ ప్రతిపక్ష నేతలను కించపరుస్తూ మాట్లాడారు. ఇది నిరుద్యోగుల్లో రచ్చ రగిల్చిందనే చెప్పాలి.

ఉద్యోగాలు భారీగా ఇచ్చామని చెప్పుకుంటున్న ప్రభుత్వ పెద్దలు చర్చలకు రమ్మంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నిస్తున్నారు నిరుద్యోగులు. OU నిరుద్యోగ JAC కూడా ప్రభుత్వ లెక్కలపై మండిపడుతోంది. రాష్ట్రం వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఉద్యమ సమయంలో, ఎన్నికల ప్రచారాల్లో అనేక సార్లు కేసీఆర్ సార్ చెప్పిన సంగతిని… ఆయన మాటల్లోనే సోషల్ మీడియాలో వినిపిస్తున్నారు నిరుద్యోగులు. రాష్ట్రంలో 2.50 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయనీ… ముందు వాటిని భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

50వేల ఉద్యోగాల మాటేంటి ?

ఓకే … ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందే అనుకుందాం… మరి MLC నోటిఫికేషన్ రాకముందుకు సీఎం కేసీఆర్ ప్రకటించిన 50 వేల ఉద్యోగాల మాటేంటని ప్రశ్నిస్తున్నారు నిరుద్యోగులు. నాలుగైదు రోజుల్లోనే నోటిఫికేషన్లు ఇచ్చేస్తామన్నంత హడావిడి చేసి … ఎందుకు వెనక్కి తగ్గారని ప్రశ్నిస్తున్నారు. కొలువుల నోటిఫికేషన్లకు… ఉద్యోగుల ప్రమోషన్లకూ లింక్ పెట్టడం… డిపార్ట్ మెంట్ హెడ్స్ తమశాఖల్లో ఖాళీలను బయటపెట్టడంలో చేసిన ఆలస్యం జరిగింది. ఈలోగా MLC ఎన్నికల కోడ్ రానే వచ్చింది. అయితే రాష్ట్రంలో 2.50 లక్షల పోస్టులు ఖాళీ ఉంటే కేవలం 50 వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం యూత్ ని మోసం చేయడమేనన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఏదేమైనా రెండు గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో అధికార పార్టీకి నిరుద్యోగుల నుంచి గట్టి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *