కోరిన కోర్కెలు తీర్చే తల్లి కామాక్షి దేవి

కోరిన కోర్కెలు తీర్చే తల్లి కామాక్షి దేవి

అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా వెలుగొందుతున్న కామాక్షి దేవీ ఆలయం తమిళనాడులోని కాంచీపురంలో కొలువై ఉంది. కంచిలోని శక్తిపీఠాన్ని నాభిస్థాన శక్తిపీఠం అంటారు. ‘క’ అంటే సరస్వతి రూపం.. ‘మా’ అనేది లక్ష్మీదేవి రూపం. ‘అక్షి’ అంటే కన్ను అని అర్థం. దీని పూర్తి అర్థం కంచిలో అమ్మవారు.. సరస్వతి లక్ష్మిగా రెండు కన్నులుగా నివసిస్తున్నది అని ప్రతీతి.

ఈ దేవి అనుగ్రహాన్ని పొందాలంటే లలితాసహస్రనామ జపం జరపడమే అనువైన మార్గం. దేవి కంచిలో మట్టితో చేసిన శివుని విగ్రహానికి పూజ చేసేదని అప్పుడు శివుడు పెద్ద అలలతో కంబనది రూపంలో వచ్చాడట. దేవిని పరీక్షించేందుకు అలల ఉద్ధృతిని పెంచగా ఆ దేవి తన రెండు చేతులలో విగ్రహాన్ని ఉంచుకుని అలల నుంచి కాపాడిందని ఇక్కడి స్థల పురాణం. దేవి సూదిమొనపై కూర్చొని పంచాగ్నుల మధ్య నిలబడి శివుడిని పూజించగా దానికి సంతసించి ఆమె ఎదుట ప్రత్యక్షమై వివాహమాడినట్లు ప్రతీతి.

కామాక్షి దేవి ఆలయాన్ని గాయత్రీ మండపంగా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు శ్రీకామాక్షి, శ్రీబిలహాసం, శ్రీచక్రం అనే మూడు రూపాలలో దర్శనమిస్తారు. ఆలయంలోని అమ్మవారి విగ్రహం పద్మాసనంపై కూర్చొనట్లు మలిచారు. దేవి తన చేతులతో పాశం, అంకుశం, పుష్పబాణం, చెరకుగడలతో దర్శనమిస్తుంది. ఈ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకుంటే శాంతి, సౌభాగ్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం.

కామాక్షీదేవి ఇక్కడ ఐదు రూపాల్లో కొలువై ఉన్నారు. గాయత్రీ మంటపంలో కొలువై ఉన్న అమ్మవారిని మూలదేవతగా పరిగణిస్తారు. ఈ మండపంలో నాలుగు గోడలను నాలుగా వేదాలుగా, 24స్తంభాలను గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలుగా భావిస్తారు. తపో కామాక్షి, అంజనా కామాక్షి, స్వర్ణ కామాక్షి, ఉత్సవ కామాక్షి అనే మరో నాలుగు రూపాల్లో ఇక్కడ దేవి కొలువై ఉన్నారు. అమ్మవారికి పౌర్ణమి రోజున నవావర్ణ పూజ, ప్రతీ బుధవారం చందనకాపు పూజ (చందనాలంకారం), రోజూ మూడు సార్లు అభిషేకం నిర్వహిస్తారు. కుంకుమార్చన, దేవి అలంకరణ చేస్తారు.

నవరాత్రులను మూడు విభాలుగా విభజించి అమ్మవారిని పూజిస్తారు. మొదటి మూడు రోజులు దుర్గాదేవిని, తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవిని, చివరి మూడు రోజులు సరస్వతీ దేవిని శాస్త్రోక్తంగా ఆరాధిస్తారు. ఆ స‌య‌మంలో కన్య(బాలిక), సుహాసిని(వివాహిత)పూజ‌ల‌ను విశేషంగా చేస్తారు. వీరిని పూజిస్తే అమ్మవారిని పూజించినట్లే అని భావిస్తారు. దేవీ నవరాత్రులలో ఏ కొత్త కార్యక్రమం మొదలుపెట్టినా అది విజయవంతం అవుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం.

కంచిలో గోవు, గజశాల:  ఆలయంలోని కుడివైపున గజరాజుల కోసం ప్రత్యేకంగా ఓ షెడ్డు ఉంది.ప్రతీ రోజు ఉదయం గోపూజ, గజపూజను ఉదయం 5 గంటలకు నిర్వహిస్తారు.

కంచి కామాక్షి దర్శన వేళలు: ప్రతీరోజూ ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ.. తిరిగి 4 గంటల నుంచి రాత్రి 8.30వరకు ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: