కార్తీక పౌర్ణమి ప్రత్యేకత

హిందువులకు కార్తీక మాసం ఎంతో ప్రాముఖమైనది. అన్ని మాసాల్లోకి కెల్లా కార్తీక మాసం చాలా విశిష్టమైనది. దక్షిణాయణంలో కార్తీక మాసానికి చాలా విశిష్టత ఉంది. ఈ పుణ్య మాసం హరిహరులకు అత్యంత ప్రీతికరమైన నెలగా భావిస్తారు. ఈ మాసం శివునికి, విష్ణువుకు ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ మాసంలో శివునికి పూజల చేయడం వల్ల విశేష పుణ్యఫలం లభిస్తుందని కార్తీక పురాణం చెబుతోంది. ఈ కార్తీక మాసంలో హిందువులు స్నానం, దానం, దీపారాధన, జపం, అభిషేకం చేస్తే ఎన్నో ఫలితాలు వస్తాయట. వేకువ జామునే సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు, ఆ తర్వాత చేసే దానాలు, ఉపవాసాలకు గొప్ప శక్తి ఉందని స్కంద పురాణంలో దాగి ఉన్న కార్తీక పురాణం వివరిస్తోంది. దీపారాధన చేస్తే పాపాలు తొలగి పుణ్యఫలం లభిస్తుంది. ఈ మాసంలో నక్తం లేదా ఉపవాసం ఆచరించగలిగితే ఆరోగ్యం, దైవచింతన పరంగా శుభాలు కలుగుతాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా శివాలయాలు అన్నీ కిటకిటలాడుతాయి. మాలధారణ చేసే వారు సైతం ఈ నెలను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. అయ్యప్పపడి పూజలు బాగా జరుగుతాయి.

కార్తీక పౌర్ణమి
కార్తీక పౌర్ణమి రోజున దేశ వ్యాప్తంగా శివాలయాలు కిటకిటలాడుతాయి. కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో ఈశ్వరుడిని అభిషేకం చేసుకొని శివారాధన చేసి జ్వాలా తోరణంను దర్శిస్తే పుణ్యఫలం కలుగుతుంది. ఈ పుణ్య మాసంలో కార్తీక సోమవారాలు అత్యంత పవిత్రమైనవిగా శివపురాణం చెబుతోంది. సోమవారం రోజు శివారాధన చేయడం, ఈశ్వరుడిని పంచామృతాలతో అభిషేకించడం, ఉపవాసం వంటివి ఆచరించడం, నదీస్నానం ఆచరించి దీపారాధన చేయడం వల్ల హరిహరుల అనుగ్రహం కలుగుతుందని కార్తీక పురాణం స్పష్టంగా చెబుతోంది. ఈ మాసంలో నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే ఆయుష్షు, ఆరోగ్యం కలిగి కష్టాలు తొలగుతాయి. ఆవుతో పాటుగా.. ఆవు నెయ్యితో దీపారాధన చేయడం లక్ష్మీప్రదమని శాస్త్రాల్లో చెప్పబడ్డాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *